YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అన్నీ చిక్కులే

అన్నీ చిక్కులే
తూర్పుగోదావరి: జిల్లాలో ఆధార్‌ నమోదు, చేర్పులు, మార్పులు, వేలిముద్రల పునరుద్ధరణకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. నమోదు కేంద్రాలకు కాళ్లరిగేలా తిరుగుతున్నా సేవలు అందడం లేదు. కొన్ని నెలలుగా జిల్లాలో ఇదే పరిస్థితి కొనసాగుతున్నా పట్టించుకునే వారు కరవయ్యారు. ఆధార్‌ కేంద్రాల నిర్వహణపై పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పడమే దీనికి కారణం. ఆధార్‌ నమోదుకు సంబంధించి యంత్ర సామగ్రి పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, వీటికి సంబంధించిన కిట్లు రీ-రిజిస్ట్రేషన్‌ కాకపోవడం ప్రజలను కష్టాలకు గురిచేస్తోంది. జిల్లాలో బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో ఆధార్‌ నమోదు, చిరునామా మార్పు, వేలిముద్రల పునరుద్ధరణ, పేర్లు, పుట్టిన తేదీల్లో తప్పుల దిద్దుబాటుకు ప్రత్యేకంగా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిస్థితి మరింత దయనీయంగా మారింది. బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లో సిబ్బందితో ఈ కేంద్రాలు నిర్వహిస్తుండగా పలు సమస్యలు ప్రతిబంధకంగా మారాయి. ఒక ఆధార్‌ కిట్‌ ద్వారా రోజుకు గరిష్టంగా 50 లావాదేవీలు చేసే అవకాశం ఉంది. కానీ వీటిలో రోజుకు 10 లావాదేవీలు కూడా నిర్వహించలేక సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. తరచూ సర్వర్‌ మొరాయిస్తుండటమే ఈ పరిస్థితికి కారణం. ఆయా కేంద్రాల వద్ద ఉదయం 8 గంటల నుంచే పెద్ద సంఖ్యలో జనం నిరీక్షిస్తున్నా ఫలితం ఉండటం లేదు. పలు చోట్ల రోజుకు 20 మందికి మించి దరఖాస్తులు ఇవ్వడం లేదు. దరఖాస్తులు పొందిన వారందరికీ ఆధార్‌ నమోదు చేయలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లోని ఆధార్‌ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో జనం గంటలపాటు నిరీక్షించాల్సి వస్తోంది. పలు తపాలా కార్యాలయాల్లో తూతూమంత్రంగా ఆధార్‌ సేవలు అందిస్తున్నారు. ఆయా చోట్ల ఆపరేటర్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. నగరాలు, పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కొన్ని మీ-సేవా కేంద్రాల్లో ఆధార్‌ నమోదుకు అనుమతించారు. 62 మండలాల్లోని 57 మీ-సేవా కేంద్రాల్లో ఆధార్‌ నమోదు కిట్లు ఏర్పాటు చేసినా పూర్తి స్థాయిలో ఇవి పనిచేయడం లేదు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, ఏడు పురపాలక సంఘాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 మీ-సేవా కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటన్నింటిలో ఆధార్‌ నమోదు చేపట్టాల్సి ఉన్నా కార్యరూపం దాల్చడం లేదు. ప్రస్తుతం కాకినాడలో ఒకటి, రాజమహేంద్రవరంలో రెండు, అమలాపురం, రామచంద్రపురంలో ఒక్కోటి చొప్పున పనిచేస్తున్నాయి. ఇవికూడా పూర్తిగా అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆధార్‌లో చేర్పులు, మార్పులకు ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 57 మీ-సేవా కేంద్రాలు, 52 బ్యాంకు శాఖలు, 38 తపాలా కార్యాలయాల్లో ఆధార్‌ నమోదు కేంద్రాలు నిర్వహిస్తున్నారు. మీ-సేవా కేంద్రాల్లో ఈ సేవలు సరిగా అందక పోవడంతో ప్రజలు బ్యాంకులు, తపాలా కార్యాలయాల్లోని ఆధార్‌ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో ప్రైవేటు వ్యక్తులు నిర్వహిస్తున్న మీ-సేవా కేంద్రాల్లో కూడా కొన్ని చోట్ల ఆధార్‌ నమోదు అవకాశం కల్పించారు. ఈ కేంద్రాల్లో సైతం సేవలు సరిగా అందక పోవడంతో పాటు నమోదుకు అధిక మొత్తంలో వసూలు చేస్తుండటంతో ప్రజలు బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు.ఆధార్‌ వెర్షన్‌లో వస్తున్న మార్పులతో మీ-సేవా కేంద్రాలు అప్పుడప్పుడూ డీ-రిజిస్ట్రేషన్‌ అవుతుంటాయి. వీటిని రీ-రిజిస్ట్రేషన్‌ చేయాల్సి ఉంది.ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో మీ-సేవా కేంద్రంలో ఆధార్‌ సేవలు నిలిచిపోతే పునరుద్ధరణ కావడం లేదు. జిల్లాలో పబ్లిక్‌, ప్రైవేటు, సహకార రంగాలకు సంబంధించిన 40 రకాల బ్యాంకులకు 784 బ్రాంచిలు ఉన్నాయి. ప్రతి 10 బ్రాంచిల పరిధిలో ఒక ఆధార్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రస్తుతం 52 బ్యాంకుల్లో ఆధార్‌ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో పూర్తి స్థాయిలో సేవలు అందించేలా ఏర్పాట్లు చేశాం. బ్యాంకు సిబ్బందికి అదనపు విధులు, మార్చి నెల దగ్గర పడటంతో వారిపై పనిభారం పెరిగింది. అలాగే ఆధార్‌ నమోదుకు రద్దీ ఎక్కువైంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా ఆధార్‌ నమోదు చేసేలా చర్యలు తీసుకుంటాం.

Related Posts