Highlights
- ఆర్థిక స్థిరత్వం ఉన్నసంస్థ
- బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్‌లో నమోదు
దేశంలో నాలుగు వేల మున్సిపాలిటీల్లో ఆర్థిక స్థిరత్వం ఉన్న ఏకైక మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ మహానగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) అని మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. దేశంలో పూణే తర్వాత బాండ్ల ఇష్యూ ద్వారా నిధులు సేకరించిన కార్పొరేషన్‌గా జీహెచ్‌ఎంసీ నిలిచింది. ఆర్థిక స్వయం సమృద్ధిలో కేర్ ఇండియా రేటింగ్ సంస్థ ఏఏ రేటింగ్ ఇవ్వడంతో బాండ్ల ఇష్యూ సులభతరం అయిందని ఆయన తెలిపారు.నిధుల సమీకరణ కోసం హైదరాబాద్ మహానగర పాలక సంస్థ అధికారికంగా బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ లిస్టింగ్‌లో నమోదైంది. జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో ఈ మేరకు ఏర్పాటు చేసిన లిస్టింగ్ కార్యక్రమంలో బీఎస్ఈ, ఎస్‌బీఐ, జీహెచ్ఎంసీ, సహా ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. కాగా, దశల వారీగా ఎస్‌ఆర్‌డీపీ కోసం వెయ్యి కోట్ల రూపాయలను బల్దియా బాండ్ల రూపంలో సేకరించనుంది. ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్టుకు మాత్రమే ఈ బాండ్లను వాడుతామని మేయర్ తెలిపారు. ముంబైలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌కు అనూహ్య స్పందన వచ్చిందన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ మహానగర పాలక సంస్థ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందని, స్థానిక సంస్థలు ప్రభుత్వాలపై ఆధారపడకుండా సొంతగా నిధులు సమకూర్చుకోవటంలో మిగతా స్థానిక సంస్థలకు ఆదర్శమని అన్నారు. ప్రస్తుతం రెటింగ్ సంస్థల అంచనా ప్రకారం ‘ఏఏ' స్టేబుల్ స్థాయిని సాధించిన జీహెచ్ఎంసీ భవిష్యత్తులో త్రిబుల్ ఏ పాజిటివ్ సాధించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. మున్సిపల్ బాండ్ల ద్వారా జీహెచ్‌ఎంసీ చరిత్ర సృష్టించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ వ్యాఖ్యానించారు.
దేశంలోనే పుణె నగరం తర్వాత బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ద్వారా ఎలక్ట్రానిక్ బిడ్డింగ్‌తో జీహెచ్ఎంసీ బాండ్ల ద్వారా నిధులు సమీకరించుకుంటోంది. దేశంలోని స్థానిక సంస్థలు ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలన్న ప్రధాని మోడీ పిలుపు మేరకు జీహెచ్ఎంసీ స్వయంగా నిధుల సమీకరణ వైపు మొగ్గు చూపింది. ప్రముఖ రేటింగ్ సంస్థలు కేర్, ఇండియా రేటింగ్...జీహెచ్ఎంసీ ఆర్థిక పరిపుష్టి, ఆదాయ మార్గాలకు గాను చక్కని ఆర్థిక క్రమశిక్షణ కింద మంచి రేటింగ్ ఇవ్వటం ద్వారా నిధుల సమీకరణ సులువైంది. ఫిబ్రవరి 14న ముంబైలో నిర్వహించిన ఎలక్ట్రానిక్ బిడ్డింగ్ ద్వారా జీహెచ్ఎంసీ జారీ చేసిన బాండ్లకు అనూహ్య స్పందన కనిపించింది. నిమిషాల వ్యవధిలోనే..452కోట్లు నిర్దేశిత 2వందల కోట్ల రూపాయల నిధుల కోసం బిడ్డింగ్‌కు వెళ్లగా కేవలం నిమిషాల వ్యవధిలోనే 452 కోట్ల రూపాయల వరకు బిడ్డర్లు ముందుకు వచ్చారు. తొలి దశగా 200 కోట్లు మాత్రమే జీహెచ్ఎంసీ సేకరించింది. కేవలం 8.9శాతం రేటుకే బిడ్లు వచ్చాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఖాతాలో నగదు జమ కూడా అయింది.