Highlights
కాంగ్రెస్‌కిప్పుడు తత్వం బోధపడింది
వ్రతం చెడ్డా ఫలితం దక్కాలి. ఏదీ లేకపోయేసరికి కాంగ్రెస్‌కిప్పుడు తత్వం బోధపడుతోంది. ఏపీ ఎంపీల ఆందోళనను వేదికగా చేసుకుని బీజేపీ ప్రభుత్వాన్ని ఇరుకున్న పడేసేందుకు ఇదే మంచి సమయం అనుకుంటోంది. తనపై ఉన్న అపనిందల్ని తుడిచిపెట్టేసుకుంటూ…ఏపీలో పోయిన పరువుని కొంతయినా మళ్లీ దక్కించుకోవాలన్నదే కాంగ్రెస్ టార్గెట్. కేవలం ఏపీ డిమాండ్లనే ముందుపెడితే అన్ని పార్టీలు మద్దతివ్వవని, పెద్ద నోట్ల రద్దు, రఫెల్ స్కామ్, నీరవ్‌మోడీలాంటి అంశాలతో కేంద్రంపై అవిశ్వాసం ప్రకటించాలనుకుంటోంది.
రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆకాంక్షను మనమే సొమ్ము చేసుకుందామని, అవిశ్వాస తీర్మానం నోటీసును మనమే ఇద్దామని ఇటీవల ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి చెప్పినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. పార్లమెంటులో 14 పార్టీలు తమకు మద్దతుగా ఉన్నాయని, అవసరమైతే ఇతర పార్టీలను కూడా ఏకం చేస్తామన్నారు. మొత్తానికి ఏపీ అవసరాల్ని ఆసరా చేసుకుని అన్ని పార్టీలు పోటాపోటీ రాజకీయం చేస్తున్నాయి.
ఆ రోజు నెత్తీనోరు బాదుకున్నా తన మాట నెగ్గాల్సిందేనని మొండికేసింది కాంగ్రెస్. అత్త ఇందిరాగాంధీతో కూడా జరగని పని తన హయాంలో చేసి చూపించాలని పంతం పట్టింది కోడలు సోనియాగాంధీ. సొంత పార్టీ ఎంపీల్ని సస్పెండ్ చేసి, అడ్డం తిరిగినవారిని బయటికి గెంటించేసి..మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విభజన తన చేతులమీదుగా జరిపించేసింది అప్పట్లో అధికారంలో ఉన్న యూపీఏ సర్కారు. తర్వాత ఏపీలో ఆ పార్టీ నామరూపల్లేకుండా పోతే…తెలంగాణలోనూ అధికారంలోకి రాలేక ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది.
నాలుగేళ్ల తర్వాత కూడా విభజన పాపాల్ని తన భుజాన మోస్తూనే ఉంది కాంగ్రెస్. ఏపీలో మళ్లీ ఎప్పటికి కోలుకుంటుందో, అసలు కోలుకుంటుందో లేదో తెలీనపరిస్థితి. తెలంగాణలోనేమో మళ్లీ అధికారంలోకొస్తానంటున్న టీఆర్ఎస్ కాంగ్రెస్‌ని ఈసారి చావుదెబ్బకొట్టి టీటీడీపీలా ఉనికే లేకుండా చేయాలనుకుంటోంది. విభజన హామీలపై, కేంద్రం ఇచ్చిన హామీలపై ఏపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనకు దిగినప్పుడు ..కాంగ్రెస్‌పైనే దుమ్మెత్తిపోశారు ప్రధాని మోడీ. అప్పట్లో విభజనకు తమ పార్టీ కూడా సహకరించిందనే విషయాన్ని పక్కనపెట్టి హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ చేసిన పనివల్లే ఇన్ని సమస్యలని ఉతికారేశారు.