యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కొన్ని సార్లు వివాదాలు కూడా మేలు చేస్తాయేమో. విశాఖ రూరల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎలమంచిలి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు విషయంలో టీడీపీ అధినాయకత్వం ఇపుడు ఒకటికి రెండు మార్లు ఆలోచన చేస్తోందట. లేకపోతే ఆయన కూడా పార్టీ మారిపోతారేమోనని కలవరపడుతోందట. ఈ మధ్యనే తనకు కావాల్సిన భీమిలీ సీటు ఇవ్వలేదన్న కారణంతో అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఏకంగా సైకిల్ దిగేసి వైసీపీలోకి చేరిపోయారు. ఆ టైంలో మరో ఎమ్మెల్యే పేరు గట్టిగా వినిపించింది. ఆయనే అవంతికి మంచి మిత్రుడైన పంచకర్ల రమేష్ బాబు. ఆయన కూడా పార్టీ మారుతారని ప్రచారం జోరుగా సాగింది. దాంతో ఉలిక్కిపడిన హై కమాండ్ వెంటనే ఆయన్ని పిలిపించి విచారించడమే కాకుండా తాను టీడీపీలోనే కొనసాగుతానని పత్రికలకు ఖండన కూడా ఇప్పించేసింది. ఇదిలా ఉండగా ఏ క్షణంలోనైనా ఆయన మనసు మార్చుకుంటారెమోనన్న అనుమానాలు మాత్రం పోలేదు.పంచకర్లను ఇపుడు హై కమాండ్ విశ్వాసంలోకి తీసుకుంటోదంట. ఆయన కోరుకున్న సీటుని ఇవ్వాలని డిసైడ్ అయిందని కూడా సమాచారం అందుతోంది. ఎలమంచిలి సీటు తనకు వద్దు, విశాఖ ఉత్తరం అసెంబ్లీ నుంచి పోటీకి దిగుతానని పంచకర్ల చెబుతూ వస్తున్నారు. అయితే నిన్నటి వరకూ అదేం కుదరదు ఎలమంచిలి నుంచే మళ్ళీ పోటీ చేయండని ఖరాఖండీగా చెప్పిన అధినాయకత్వం ఇపుడు మెత్తబడిందని టాక్. పంచకర్ల అడిగినట్లుగా విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీకి ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి విశాఖ ఉత్తరం మిత్ర పక్షం బీజేపీకి పొత్తులో భాగంగా 2014 ఎన్నికల్లొ ఇచ్చారు. అక్కడ ఇపుడు చాలామంది టీడీపీ ఆశావహులు పోటీలో ఉన్నారు. పంచకర్ల కోసం వారిని బుజ్జగించాల్సివస్తోందని టాక్.ఇక మిగిలిన వారు సైతం పార్టీ మారుతామని అంటున్నారు. అటువంటి వారిలో గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు, అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, పాయకరావు పేట ఎమ్మెల్యే అనిత పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో పల్లాకు గాజువాకలో టికెట్ ఇవ్వలేకపోయినా విశాఖ ఎంపీ సీటు ఇస్తామని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. అలాగే అనకాపల్లి, పాయకరావుపేట ఎమ్మెల్యేలకు ఇతర అవకాశాలు, ఎమ్మెల్సీలు, నామినేటెడ్ పదవుల ఆశలు చూపుతున్నారని టాక్. మొత్తానికి అవంతి సృష్టించిన రాజకీయ దుమారం పుణ్యమాని టీడీపీలో మిగిలిన తమ్ముళ్ళు బాగుపడుతున్నారని సెటైర్లు పడుతున్నాయి