యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సినిమాలు సమాజాన్ని మార్చేస్తాయా? ప్రజలను ప్రభావితం చేసేస్తాయా? ఇది చిరకాలంగా తెలుగు నేలపై మిగిలి ఉన్న ప్రశ్నలు. రెండున్నర గంటల సినిమా చూపించి సమాజంలో మార్పు తెచ్చేంత దర్శకులు ఉన్నారా? అంటే పెదవి విరుపులే సమాధానంగా వస్తాయి. అయితే, ఆ రెండు గంటల్లో వీక్షకుడి ఎమోషన్‌ను, శారీరక సడలింపులను ఉద్వేగం చెందిస్తాయనడంలో సందేహం లేదు కానీ.. మూవీ ధియేటర్ నుంచి బయటకు వచ్చాక మాత్రం ఆ ప్రభావం ఉంటుందని చెప్పే వారు లేక పోవడం ఒక వింత! సరే ఇప్పుడు విషయంలోకి వద్దాం. మరో రెండు మాసాల్లో ఏపీలో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాస్తవానికి ఇవి ప్రాంతీయ ఎన్నికలే అయినా దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.ఇంకో మాట చెప్పాలంటే.. ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా ఆసక్తికర సబ్జెక్ట్ గా కూడా ఏపీ ఎన్నికలు మారిపోయాయి. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి ప్రపంచ దేశాధినేతలను కూడా ఏపీకి తీసుకుని వచ్చి రాష్ట్ర అభివృద్ధికి పునాదులు వేశానని చెప్పుకొనే చంద్రబాబు సీఎంగా ఉండడం. మరో కీలకమైన విషయం ఈయనను ఓడించడమే ధ్యేయంగా చంద్రబాబు చిరకాల శత్రువు వైఎస్ కుమారుడు జగన్. మరో మూడో కోణం.. నిన్న మొన్నటి వరకు హల్ చల్ చేసినా.. ఇప్పుడు తెరమరుగైంది. అది పవన్. ఇప్పుడు ఈయన హడావుడి తగ్గిపోయింది.అయితే, ముఖ్యంగా సీఎం సీటు కోసం బజారున పడి కొట్టేసుకుంటున్నట్లే పనిచేస్తున్న చంద్రబాబు, జగన్‌ల విషయానికి వస్తే.. వీరి తరఫున ఎవరో సినిమాలు తీస్తున్నారని, ఆ సినిమాలు భారీ ఎత్తున ప్రభావం చూపుతాయని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ మహానాయకుడు నందమూరి బాలకృష్ణ రిలీజ్ చేస్తున్న సినిమా. లక్ష్మీస్ ఎన్టీఆర్ వర్మ రిలీజ్ చేస్తున్న సినిమా. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఎన్నికలను ప్రభావితం చేస్తాయని అంటున్నారు. అయితే, వాస్తవానికి ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా అంత ప్రభావితం చేసే పరిస్థితి లేదని స్పష్టం చేస్తున్నారు పరిశీలకులు. ప్రజలు విజ్ఞులని, ఎన్టీ రామారావును అడ్డుపెట్టి రాజకీయాలు చేస్తే.. వారు ఆ ఆమాత్రం అర్ధం చేసుకోలేని పరిస్థితిలో లేరని అంటున్నారు. మొత్తానికి సినిమాలే ఎన్నికలను ప్రభావితం చేస్తే.. ప్రతి పార్టీ కూడా ఎన్నికల కోడ్ విడుదల కాగానే యూట్యూబ్‌లోనో వాట్సాప్‌లో సినిమాలు విడుదల చేస్తే సరిపోతుంది. ఇక, ప్రచారాలతో పనేంటి అంటున్నారు. అంతేకదా!?