యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీలో కీలక నగరమైన విజయవాడపై టీడీపీ దృష్టి సారించింది. టికెట్ కేటాయింపులో మరింత ఆలస్యం చేస్తే మంచింది కాదు అనుకుని కేటాయింపుపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాల్లో మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్‌రావుకు టీడీపీ అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో ఆయన ఇప్పటికే జోరుగా ప్రచారం సాగిస్తున్నారు. అసంతృప్తులను కూడా బుజ్జగించే పనిలో పడ్డట్లు సమాచారం . వైసీపీ కదలికలపై…బీసీ ఓటర్లపై ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అలాగే పశ్చిమ నియోజకవర్గం టికెట్ను ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ కూతురు ఖతూన్‌కు కేటాయించినట్టు ఆయన చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే జలీల్‌ఖాన్ కూతురితో కలసి నియోజకవర్గంలో ప్రచారం సాగిస్తున్నారు.ఈ నియోజకవర్గంలో బీసీ ఓటర్లతో పాటు మైనార్టీల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఆయనకు కలసి వస్తుందని చంద్రబాబు యోచించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన కుటుంబ సభ్యుల్లో ఎవరికి టికెట్ ఇవ్వద్దని ముందు భావించినా..చివరికి జలీల్‌పై చంద్రబాబు కరుణించినట్టు ప్రచారం జరుగుతోంది. అలాగే బీసీ కోటాలో బుద్ధా వెంకన్న సైతం సీటు రేసులో ఉన్నా చివర్లో ఏమైనా మార్పులు జరగవచ్చన్న అంచనా కూడా ఉంది. తూర్పు నియోజకవర్గం నుంచి దేవినేని ఉమాను బరిలో దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. తూర్పు సిట్టింగ్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావును గన్నవరం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నవంశీ వల్లభనేని విజయవాడ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించాలని యోచిస్తున్నారు. అయితే ఈ ఈక్వేషన్ ఎంత వరకు సెట్ అవుతుందో ? చూడాలి. నగరానికి ఆనుకుని ఉన్న పెనమాలూరు నుంచి లోకేష్‌ను పోటీలో నిలిచేందుకు చూస్తున్నారట. అయితే ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంట. ఇది కాకుంటే యథావిధంగా సిట్టింగ్ ఎమ్మెల్యే బోడే ప్రసాద్‌నే కాంటెస్ట్‌లో ఉండటం ఖాయం. ఇక నగరానికి ఆనుకుని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు దాదాపు ఏడు నుంచి ఏనిమిది మంది పేర్లు వినబడుతుండటం గమనార్హం. ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ముఖ్యంగా నియోజకవర్గం ఇన్‌చార్జి గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో పాటు బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్, విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనురాధ వంటి పేర్లు ప్రముఖంగా వినబడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్నారు. చూడాలి చంద్రబాబు ఎవరివైపు మొగ్గు చూపుతారో…?