YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న చంద్రబాబు

  సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న చంద్రబాబు

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:       

రానున్న ఎన్నికలకు కీలకంగా తీసుకున్న తెలుగుదేశం పార్టీ ఇందుకోసం సన్నద్ధం అవుతోంది. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతీ రోజూ ఉదయమే టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో అంతకుముందు రోజు జరిగిన రాజకీయ పరిణామాలపై తన అభిప్రాయాలను పార్టీ శ్రేణులతో ఆయన పంచుకుంటున్నారు. చంద్రబాబు మాట్లాడిన అంశాలను లీక్ ల రూపంలో మీడియా ప్రతినిధులకు చేరవేస్తుంటారు. ఇలా వచ్చిన సమాచారాన్ని ప్రతీ రోజు ఉదయం అన్ని ఛానళ్లు ప్రసారం చేస్తాయి. ఇందులో భాగంగా మూడు రోజుల క్రితం జగన్ లో ప్రస్ట్రేషన్ పెరిగిపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అయితే, జగన్ సంగతి అటుంచితే ప్రతీ రోజు టెలీకాన్ఫరెన్స్ లో చంద్రబాబు మాట్లాడిన మాటలు చూస్తుంటే మాత్రం ఆయన ఎందుకో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై ఇబ్బంది పడుతున్నారా అనే అనుమానం కలుగుతోంది.వరుసగా ఆయన మాటలు చూస్తుంటే… ప్రతీ రోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, జగన్ నే టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ప్రత్యర్థి పేరును పదేపదే చెబుతూ టార్గెట్ చేయడం లాభంతో పాటు నష్టమూ చేసే అవకాశం ఉంది. ఇక, పార్టీ ఫిరాయింపులపై ప్రతీ రోజూ సీరియస్ గా స్పందిస్తున్న చంద్రబాబు… కేసీఆర్ తో కలిసి జగన్ కుట్ర చేస్తున్నారని, హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న టీడీపీ నాయకులను కేసీఆర్ తో కలిసి బెదిరింపులకు గురి చేసి వైఎస్సార్ కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. అయితే, పలువురు టీడీపీ మంత్రులు, నేతలు మాత్రం అధినేత వాదనకే విరుద్ధంగా స్పందించారు. అవంతి, ఆమంచి వంటి వారికి టిక్కెట్లు దక్కవనే పార్టీ మారారని వారు ప్రకటించారు. చంద్రబాబు చెప్పినట్లుగా.. నిజంగా హైదరాబాద్ లో ఆస్తులు ఉన్న వారిని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారా.. అంటే అసలు హైదరాబాద్ లో ఆస్తులు లేనిది ఎవరికి.? టీడీపీ ప్రజా ప్రతినిధుల్లో సగాని కంటే ఎక్కువ మందికి హైదరాబాద్ లో ఎన్నో కొన్ని ఆస్తులు ఉన్నాయి. చాలా మందికి వ్యాపారాలు ఉన్నాయి.వైసీపీలో చేరిన అవంతి శ్రీనివాసరావుకు హైదరాబాద్ లో విద్యాసంస్థలు ఉన్నాయి. అయితే, టీడీపీలో కీలకంగా ఉన్న మంత్రి నారాయణకు హైదరాబాద్ లో ఎన్ని కాలేజీలు ఉన్నాయో చెప్పాల్సిన పని లేదు. ఇంకా చాలామంది టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు హైదరాబాద్ లో వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. ఇక, నిన్న సినీ నటుడు అక్కినేని నాగార్జున జగన్ ను కలిశారు. ఈ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని, స్నేహితుడిగానే జగన్ ను కలిశానని నాగార్జున ప్రకటించారు. కానీ, చంద్రబాబు మాత్రం.. జగన్ ను నాగార్జున కలవడం తప్పు అన్నట్లుగా చెప్పారు. నేరస్థుడిని సినీ హీరోలు కలవడం మంచిది కాదని వ్యాఖ్యానించారు. అయితే, జగన్ పై నేరం రుజువు కానందున ఇంకా ఆయన నిందితుడే అనే విషయాన్ని చంద్రబాబు మరిచిపోయారు. సరే ముందు నుంచీ టీడీపీ ఇదే వాదనపై ఉంది.ఇక, నిన్నా, ఇవాళ పుల్వామా దాడిపై చంద్రబాబు వ్యాఖ్యలు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నాయి. ఎన్నికల వేళ ఉగ్రదాడి జరగడం వెనుక కేంద్రం పాత్ర ఉందేమో అని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పుడు మమతా బెనర్జీకి మద్దతుగా సీఎం మాట్లాడినట్లు టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు వచ్చాయి. మమతా ఆరోపణలు కొట్టి పారేయలేమని, నరేంద్ర మోడీ ఏమైనా చేయగలరని ఆయన ఆరోపించారు. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదని పాకిస్థాన్ స్పష్టం చేసిందని ఆయన గుర్తు చేశారు. ఈ దాడి వెనుక రాజకీయ లబ్ధి ఉందా అని దేశవ్యాప్తంగా అనుమానం బలపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, భారత్ లో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా పాకిస్థాన్ పాత్ర ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆధారాలతో సహా ఈ విషయాన్ని బయటపెట్టినప్పుడు కూడా పాకిస్థాన్ తమకు సంబంధం లేదని బుకాయించింది. ఇప్పుడు కూడా అలానే బుకాయించింది. అంత మాత్రాన పాకిస్థాన్ కు సంబంధం లేదంటే మన దేశంలో ఎవరూ నమ్మడానికి సిద్ధంగా లేరు. సరే, మోడీతో చంద్రబాబుకు రాజకీయ విభేదాలు ఉన్నా, ఉగ్రదాడిపై అనుమానాలు ఉన్నా అన్ని తెలిసిన చంద్రబాబు వంటి సీనియర్ నేత దేశం మొత్తం ఉగ్రదాడితో ఆవేదనలో ఉన్న ఈ సమయంలో ఇలా స్పందించడం సరికాదని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి

Related Posts