తీరంలో మద్యం డంప్ స్వాధీనం
ఆరువేలు బయటకు.. దొరికింది 1248 సీసాలే
సీలు వేసే యంత్రం, స్పిరిట్ తదితరాలు స్వాధీనం
సంక్రాంతి పండుగ సందడే కీలకంగా తయారీ
పరారీలో సూత్రధారి.. ఇద్దరిపై కేసులు నమోదు
కల్తీ మద్యం... ఒకటి, రెండు సీసాలు కాదు. ఏకంగా భారీ డంప్ బయటపడింది. దీంతో గుంటూరు జిల్లా తీరం వార్తల్లోకి ఎక్కితే, మద్యం ప్రియులు ఉలిక్కిపడుతున్నారు. గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల ఎక్సైజ్ శాఖ అధికారులకు ఇది సవాలు విసురుతోంది. రేపల్లె మండలం తుమ్మల సమీపంలోని గాదెవారిపాలెంలోని ఓ నివాసంలో కొద్ది రోజులుగా ఏడుగురు వ్యక్తులు కలసి కల్తీ మద్యం తయారీకి ఒడిగట్టారు. దీనికోసం ప్రత్యేకంగా యంత్రాలు కొనుగోలు చేశారు. ఇప్పటికే 6వేల సీసాల మద్యం తయారుచేసి బయటకు పంపగా, మరో నాలుగువేల సీసాల మద్యం తయారికి ఉపయోగించే ముడిసరకు మాత్రం ఎక్సైజ్ అధికారులకు దొరికింది. కొల్లూరుకు చెందిన రమావత్ సాంబశివనాయక్, రేపల్లెకు చెందిన పూర్ణిమ వైన్స్ నిర్వాహకుడు గుమ్మడి సాంబశివరావు కలిసి నకిలీ మద్యంను తయారు చేస్తున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏసీ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు.
కల్తీ మద్యాన్ని రేపల్లెలోని పూర్ణిమ వైన్స్‌లో విక్రయిస్తున్నారన్నారు. ఈ క్రమంలో అందిన పక్కా సమాచారంతో దాడులు చేసినట్లు ఆయన తెలిపారు. పూర్ణిమ వైన్స్ నిర్వాహకుడు గుమ్మడి సాంబశివరావు, రమావత్ సాంబశివనాయక్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గుంటూరు ఎన్‌ఫోర్స్‌మెంటు, తెనాలి ఎక్సైజ్ శాఖల అధికారుల బృందం మెరుపు దాడితో భారీ డంప్ మంగళవారం పట్టుబడింది. ఇద్దరిని అదుపులోకి తీసుకుంటే, మిగిలిన ఐదుగురు మాత్రం పరారయ్యారు. వీరిలో కీలక వ్యక్తికోసం వేట మొదలుపెట్టారు.
మద్యం తయారీకి అవసరమైన స్పిరిట్ వె య్యి లీటర్లు, ఇతర ముడి పదార్థాలు, సీసాలకు సీలు వేసేలా మూతలు అమర్చేందుకు ఓ యంత్రం, మద్యం తయారీకి అవసరమైన స్టీల్ డ్రమ్ములు, 20 లీటర్ల క్యానులు భారీ స్థాయిలో కొనుగోలు చేశారు. వాటిని రహస్యంగా ఆ ఇంటికి తరలించి తయారీకి ఉపక్రమించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా వేసే కోడి పందాలు, ఇతర పోటీలకు వచ్చే జనం లక్ష్యంగానే ఈ మద్యం సీసాలను తయారు చేసేందుకు సిద్ధపడ్డారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొల్లూరు మండలం బోస్‌నగర్‌కు చెందిన పాత సీసాలు సేకరించి అమ్మే వ్యాపారి రమావత్ సాంబశివరావునాయక్ నుంచి గత నెలలో 6 వేల పాత మద్యం ఖాళీ బాటిల్స్‌ను మార్కెట్ ధరకంటే ఎక్కువకే కొనుగోలు చేశారు.
దీనిలో వారు తయారు చేసిన కల్తీ మద్యాన్ని నింపి అనుమానం రాకుండా కొత్త మూతలు వేసి దానిపై సీలు వేసేలా యంత్రాన్ని ఉపయోగించారు. అసలు మద్యం సీసాల తరహాలో పెట్టెలలో పెట్టి అమ్మకపు కేంద్రాలకు తరలించారు. ఈ రూపంలో తయారుచేసిన సీసాలు సుమారు 6వేలకుపైగా బయటకు వెళ్లిపోయినట్టు అనుమానిస్తున్నారు.
స్థావరాలు ఎన్నో..
గాదెవారిపాలెంలో తయారైన ఆరు వేల బాటిల్స్ ఎక్కడకు వెళ్లాయనేది అంతుచిక్కని ప్రశ్న. ఈ మద్యం తయారీ ముఠాలోని కీలక నిందితుడు దొరికితేనే ఎక్కడికి వెళ్లిందనేది తేలే అవకాశం ఉంది. తాజాగా దుగ్గిరాల మండలంలో సోమవారం ఈ తరహా మద్యం సీసాలను ఎక్సైజ్ అధికారులు దాడిచేసి పట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇదే మండలంలోని ఈమనిలో, తెనాలి పట్టణ పరిధిలో పట్టుబడ్డాయి. అయితే అవి ఎక్కడి నుంచి వచ్చాయనేది మాత్రం నేటికీ తేలలేదు. కల్తీ మద్యం రాకెట్ రేపల్లె మండలంలోనే ఉందా? ఇంకా స్థావరాలు ఉన్నాయనేది కూడా ప్రశ్నార్థకమే. బెల్టు షాపుల్లో మద్యం పట్టుబడితే వాటిని సరఫరా చేసిన దుకాణదారులపైనా కేసులు పెడుతుండటంతో సరఫరా చాలావరకు తగ్గింది. ఇదికూడా కల్తీమద్యం తయారీకి కారణం అవుతోంది.
అధికారుల్లో ఆందోళన
కల్తీ మద్యం బయటకు వెళ్లిందని తెలియటంతో ఎక్సైజ్ అధికారుల్లోనే కాక పోలీసు అధికారుల్లోనూ ఆందోళన మొదలయింది. స్పిరిట్ ఏ మోతాదులో తీసుకున్నా ఆరోగ్యానికి హానికరం, ప్రాణాపాయం. గతంలో విజయవాడలో ఈ తరహా కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లిన మద్యంలో మోతాదు మించినా ప్రమాదకరమేనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించి కొల్లూరు మండలం క్రాప గ్రామానికి చెంది ఓ వ్యక్తి, తెనాలిలో ఓ మద్యం దుకాణంలో పనిచేసే మరో వ్యక్తి కీలకమని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పట్టుబడిన ఇద్దరు వ్యక్తుల ద్వారా ఆధారాలు రాబట్టే పనిలో అధికారులున్నారు.
తెనాలికి చెందిన వ్యక్తి అక్కడ దాడి జరిగిన విషయం తెలిసిన వెంటనే పరారైనట్టు సమాచారం. అతను పనిచేసే మద్యం దుకాణ యజమానిని కూడా అధికారులు హెచ్చరించారనేది సమాచారం. సూత్రధారి పట్టుబడితే దీనివెనకున్న చిక్కుముడులు వీడటంతోపాటు, కల్తీ కాటు ఎవరిని మింగేయకుండా కాపాడుకునే అవకాశం ఉంది. మంగళవారం జరిపిన దాడుల్లో రేపల్లె ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డితోపాటు, గుంటూరు ఏసీ శ్రీకాంత్‌రెడ్డి, తెనాలి ఎక్సైజ్ సూపరింటెండెంట్ అరుణకుమారి, ఇతర బృందం ఉన్నారు.