YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో చతుర్ముఖ పోటీ అనివార్యమే

ఏపీలో చతుర్ముఖ పోటీ అనివార్యమే

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల వేడి పెరుగుతోంది. ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకోకుండా... ఎవరు ఎవరితో కలసి వెళ్లకుండా .. ఎవరికి వారే ఒంటరిగా బరిలో దిగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఏపీలో ఏం జరగబోతోంది? 2014లో జరిగిందేమిటి... 2019లో మనం చూడబోయేదేమిటి? ఇవన్నీ చెప్పేవన్నీ ఊహలు కావు... అంచనాలు మాత్రమే. కిందటిసారి పార్టీలకు వచ్చిన ఓట్ల శాతం ఎంత? గెలుచుకున్న సీట్లెన్ని? రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర... మూడు ప్రాంతాల్లో ఎన్నికల మూడ్‌ ఎలా ఉంది.? ఏ పార్టీకి ప్రాబల్యం ఎక్కువగా ఉంది.?.. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల్లో ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? ఏఏ జిల్లాల్లో పార్టీల ప్రాభల్యం ఎక్కువగా ఉంది? ఇవీ సగటు ఏపీ పౌరుడిని ఆలోచింపచేస్తున్న ప్రశ్నలు. సర్వేల సారాంశాలు... సోషల్‌ మీడియా ప్రచారాలు.. నాయకుల మనోనిబ్బరాలు చూస్తుంటే... అన్ని పార్టీలు అధికారంలోకి రావాలి. కానీ అలా జరగదు. యుద్ధంలో గెలిచేది ఒకరే అయినా.. ఓడిపోయేది ఎందరో. అదే సీన్‌ ఇప్పుడు ఓట్‌ ఆంధ్రప్రదేశ్‌ను ఆలోచింపచేస్తోంది.  హోరాహోరీగా, నువ్వానేనా అన్నట్టు సాగిన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకుంది. సైకిల్‌ను పంక్చర్‌ చేసి ఫ్యాన్‌గాలిని హైస్పీడ్‌ మీద రన్‌ చేద్దామనుకున్న వైస్సార్‌సీపీ ప్రధాన ప్రతిపక్షానికే పరిమితమైంది. ఏపీ విభజన అంశం కాంగ్రెస్‌ మీద కసి పెంచేలా చేసింది. అంతటితో ఆగిందా.. లేనే లేదు. ఆ పార్టీకి కనీసం ఒక్కసీటు కూడా దక్కనివ్వకుండా ఆంధ్ర జనం ఆగ్రహంతో ఊగిపోయారు. అలా హస్తరేఖలు 2014లో పూర్తిగా కనమరుగయ్యాయి. అప్పుడే పుట్టిన జనసేనాధిపతి... టీడీపీకి దన్నుగా నిలిచి బాబు వెనుక బాలుడు అనిపించుకున్నాడు పవన్‌కల్యాణ్‌. కమలనాథులు కూడా బాబుతో పాటే కదిలి.. తెలుగుదేశం విజయంలో పాలుపంచుకున్నారు. ఇక పోలైన ఓట్లు, దక్కిన సీట్లు, వచ్చిన శాతాన్ని పరిశీలిస్తే.. తెలుగుదేశం పార్టీకి 1కోటి 57 లక్షల 46 వేల 215 ఓట్లు పోలవగా, ప్రధాన ప్రతిపక్షానికి 1 కోటి 34 లక్షల 94 వేల 76 ఓట్లు పోలయ్యాయి. టీడీపీకి 32.53 శాతం ఓట్‌ షేర్‌, 39.79 శాతం సీట్‌ షేర్‌ లభించింది. వైసీపీకి 27.9 శాతం ఓట్‌షేర్‌, 23.8 శాతం సీట్‌ షేర్‌ దక్కింది. ఓట్‌ షేర్‌ రెండు పార్టీలకు కేవలం ఐదు శాతమే కాగా.. సీట్‌ షేర్‌కు వచ్చేసరికి అది 16 శాతానికిపైగానే చేరిపోయింది. అంటే పోలైన ఓట్లలో ఒక్కటి అటు ఇటు అయినా కానీ దాని ప్రభావం సీట్లపై భారీగానే పడిపోతుంది. అదే నిజమని 2014లో ఏపీలో మరోసారి రుజువైంది. పోలైన ఓట్ల శాతం అధికారాన్ని ఏ మేరకు ప్రభావితం చేయగలదో ఏపీ ఎలక్షన్‌లో పార్టీలక తెలిసివచ్చింది. ఇక 2014లో జిల్లాల వారీగా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే... శ్రీకాకుళం జిల్లాలో 76 శాతం, విజయనగరం జిల్లాలో 78శాతం, విశాఖపట్నంలో 73, తూర్పు గోదావరిలో 78, పశ్చిమ గోదావరి 78, కృష్ణాలో 80, గుంటూరులో 84, ప్రకాశంలో 80, నెల్లూరులో 73, కడపలో 75, కర్నూలులో 76, అనంతపురంలో 80, చిత్తూరు జిల్లాలో 78 శాతంగా నమోదైంది. మొత్తంగా విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో 175 స్థానాలకు ఏపీలో ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ 102 స్థానాల్లో, వైసీపీ 67 చోట్లా, నాలుగు బీజేపీ, ఇతరులు రెండు చోట్ల విజయం సాధించగా.. తెలుగుదేశం అధినేతగా చంద్రబాబు నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రి అయ్యారు.

Related Posts