YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

మార్చి 2న కోట్ల ఫ్యామలీ చేరిక

మార్చి 2న కోట్ల ఫ్యామలీ చేరిక
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కోట్ల కుటుంబం టీడీపీలో చేరిక మార్చి 2కి వాయిదా పడింది. జనవరి 19న ముఖ్యమంత్రి చంద్రబాబును అమరావతిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఆయన సతీమణి, డోన్‌ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ, తనయుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి కలిశారు. వారం పది రోజుల్లోగా కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతుందని అందరూ భావించారు. అయితే కార్యకర్తల అభిప్రాయాలు తీసుకునేందుకు సమయం తీసుకున్నారు. కార్యకర్తలు సానుకూలంగా స్పదించడంతో సైకిల్‌ ఎక్కేందుకు సిద్ధమయ్యారు. జిల్లాకు గుండ్రేవుల, వేదవతి ప్రాజెక్టు, ఎల్లెల్సీ బైపాస్‌ పైప్‌లైన్‌ కెనాల్‌ ఇస్తే టీడీపీలో చేరేందుకు సిద్ధమని కోట్ల ప్రకటించారు. ఈ మూడు ప్రాజెక్టులతో పాటు ఆర్డీఎస్‌ ప్రాజెక్టుకు కూడా ముఖ్యమంత్రి అనుమతులు, నిధులు ఇస్తూ జీవో జారీ చేశారు.దీంతో ఈ నెల 28న కోడుమూరులో నిర్వహించే భారీ బహిరంగ సభకు సీఎం చంద్రబాబును ఆహ్వానించి ఆయన సమక్షంలోనే టీడీపీలో చేరాలని కోట్ల కుటుంబం ఏర్పాట్లు చేసుకుంది. 28న కేఈ ప్రతాప్‌ కుమారుడి పెళ్లి.. ఈ నెల 28న డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు, డోన్‌ టీడీపీ ఇన్‌చార్జి కేఈ ప్రతాప్‌ కుమారుడు కేఈ నితిన్‌, అక్షితల వివాహం గోవాలో జరగనుంది. పెళ్లికి రెండు మూడు రోజుల ముందే డిప్యూటీ సీఎం కేఈతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గోవాకు వెళుతున్నారు. 28న కోట్ల కుటుంబం టీడీపీలో చేరాలని భావించింది. కోట్ల, కేఈ కుటుంబాల మధ్య దశాబ్దాల రాజకీ య వైరం ఉంది. 28న కోడుమూరు సభకు రాలేకపోతే ప్రజలకు మరో విధంగా సంకేతం వెళ్లే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సీఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కోట్ల చేరిక సమయంలో రెండు కుటుంబాలు ఉంటేనే కార్యకర్తలకు మంచి సందేశం వెలుతుందని సీఎం భావించారు. దీంతో 28వ తేదీన నిర్వహించాల్సిన సభను మార్చి 2కి వాయిదా వేసుకోవాలని కోట్లకు సీఎం సూచించినట్లు తెలిసింది. దీంతో బహిరంగ సభ తేదీని 2వ తేదీ నిర్వహించాలని కోట్ల వర్గం నిర్ణయించింది. ఈ సభకు సీఎంను ఆహ్వానించేందుకు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి సోమవారం అమరావతికి వెళుతున్నారు. సీఎంను కలిసి, కర్నూలు లోక్‌సభ స్థానంపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం.

Related Posts