యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
అనంతపురం–అమరావతి నేషనల్ హైవే విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా ఉన్న చెట్లు రోజురోజకూ కనుమరుగవుతున్నాయి. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం డివిజన్‌లో అనంతపురం–అమరావతి హైవే సుమారు 135 కిలోమీటర్లు మేర విస్తరించి ఉంది. గిద్దలూరు నుంచి త్రిపురాంతకం మండలం వరకు రోడ్డు విస్తరణ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో భారీగా రోడ్డుకు ఇరువైపులా పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయి. డివిజన్‌లో 135 కిలోమీటర్ల మేర పనులు జరుగుతుండగా త్రిపురాంతకం మండలంలో నేషనల్ హైవే సుమారు 40 కిలోమీటర్లు వరకు విస్తరించి ఉంది. ఈ రోడ్డుకు ఇరువైపులా ఏళ్ల తరబడి పెరిగిన వృక్షాలను కూల్చి వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో రోడ్డుకు ఇరువైపులా నీడను ఇవ్వడంతో పాటు పర్యావరణం పరిరక్షణకు ఉపయోగపడుతున్న వృక్షాలు కనుమరుగై పోతున్నాయి.ఇది వరకూ రోడ్డుపై ప్రయాణం చెట్ల మధ్య ఆహ్లాదకరంగా ఉండేది. అలాంటిది రోడ్లు విస్తరణ, పెరుగుతున్న వాహనాల రాకపోకలు, ప్రమాదాల నివారణ, భవిష్యత్ అవసరాలు దృష్యా కర్నూలు–గుంటూరు రోడ్డును అనంతపురం–అమరావతి నేషనల్ హైవేను తమ ఆధీనంలోకి తీసుకుంది. ఈ మేరకు రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. విస్తరణ పనులతో ఏళ్లతరబడి ఉన్న చెట్లు తొలగించక తప్పడం లేదన్న అభిప్రాయాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది వ్యక్తం చేస్తున్నారు. తొలుత విస్తరణ జరుగుతున్న ప్రాంతంలో మొక్కలు నాటి క్రమేణా చెట్లను తొలగించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. లేదా రోడ్డు విస్తరణలో వంపులు తొలగిస్తూ పనులు చేపట్టి ఒక పక్కన కొంతవరకు చెట్లను ఉంచితే నష్టం జరిగేది కాదన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. రోడ్డు నిర్మాణం పూర్తయ్యే సరికి పూర్తిగా చెట్ల ఆనవాలు కనిపించే అవకాశం ఉండదు. అందుకు ఇప్పటి నుంచైనా తిరిగి చెట్లు పెంచేందుకు నేషనల్ హైవే అథారిటీ తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ వినిపిస్తోంది.నేషనల్ హైవేపై రోజూ వేలాది వాహనాలు ప్రయాణం చేస్తున్నందున వాటి నుంచి వచ్చే పొగ కారణంగా కలుషిత వాతావరణం ఏర్పడే ప్రమాదం లేకపోలేదు. చెట్లు ఉంటే వాతావరణానికి ఎలాంటి భంగం కలగదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. చెట్లు కొట్టేయడంతో పర్యావరణం దెబ్బతింటోంది. ఈ ప్రాంతంలోని చెట్లతో కొంత వరకు ఉపయోగకరంగా ఉంది. ఈ చెట్లన్నీ కూల్చివేతతో రోడ్డు ఎడారిగా కనిపిస్తోంది. తిరిగి రోడ్డుకు ఇరువైపులా చెట్లు పెంచాల్సిన అవసరాన్ని గుర్తించి ఏళ్ల తరబడి జీవించే అడవి జాతి వృక్షాలతో పాటు తొందరగా పెరిగి పచ్చని వాతావరణం కల్పించే చెట్లు పెంచితే ఉపయోగం ఉంటుంది. ఇప్పటి నుంచే దానికి తగిన విధంగా ప్రయత్నం చేయడంతో పాటు మొక్కలు పెరిగే వరకు వాటిని సంరక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. మొక్కలు వేసి వదిలేస్తే అవి బతికే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది