YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కిల్లి లక్ష్యం నెరవేరేనా...

కిల్లి లక్ష్యం నెరవేరేనా...

యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:

శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో కొన్ని సామాజిక వర్గాలు దశాబ్దాలుగా అధిపత్యం చూపిస్తూ వస్తున్నాయి. అందులో ముఖ్యమైనవి కాపులు, వెలమలు, కళింగులు. ఈ మూడు కులాల చుట్టూనే శ్రీకాకుళం రాజకీయాలు తిరుగుతూ వస్తున్నాయి. ఒకప్పుడు కళింగులే దశాబ్దాలుగా ఎంపీ పదవులు అనుభవిస్తూ వచ్చారు. ఆ దూకుడుకు అడ్డుకట్ట వేసింది టీడీపీ హయాంలో ఎర్రన్నాయుడు. ఆయన వెలమ సామజిక వర్గం నుంచి వచ్చి కళింగుల పెత్తనాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు. వరసగా అనేక పర్యాయాలు ఎర్రన్నాయుడు కూడా ఎంపీగా నెగ్గారు. అటువంటి ఎర్రన్నాయుడుని 2009 ఎన్నికల్లో కళింగ సామాజికవర్గానికి చెందిన కిల్లి కృపారాణి ఓడించేశారు. రాజకీయాల్లో ఎర్రన్నాయుడుకు అది తొలి ఓటమి. ఆ తరువాత ఆయన 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఇక 2014 ఎన్నికల్లో కేంద్ర మంత్రి హోదాలో కిల్లి కృపారాణి పోటీ చేశారు. ఎర్రన్నాయుడు కుమారుడు రామ్మోహననాయుడు తొలిసారిగా పోటీ చేయడమే కాదు, తన తండ్రిని మొదటి సారి ఓటమి పాలు చేసిన కిల్లి కృపారాణిని ఓడించారు.మళ్ళీ ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి. అచ్చం వాతావరణం చూస్తే 2009 నాడు లాగానే ఉంది. ఏపీలో మూడు ముక్కలాట రాజకీయం సాగుతోంది. గతసారి విభజన కారణంగా కాంగ్రెస్ ఓడిపోయింది. దాంతో కిల్లి కృపారాణి కూడా పరాజయం పాలు అయ్యారు. అయితే ఇపుడు ఆమె వైసీపీ తరఫున ఎంపీ సీటుకు పోటీ కనుక చేస్తే విజయావకాశాలు ఎక్కువగానే ఉన్నాయని అంటున్నారు. మళ్ళీ టీడీపీ తరఫున రామ్మోహననాయుడు పోటీ పడుతున్నారు. ఇపుడు వైసీపీ తరఫున రంగంలో కిల్లి ఉంటే రామ్మోహననాయుడుకి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. నాడు తండ్రి ఎర్రన్నాయుడుని ఓడించి జెయింట్ కిల్లర్ గా పేరు గడించిన కిల్లి కృపారాణి ఈసారి తనయున్ని ఓడించి కొత్త రికార్డ్ సృష్టిస్తారా అన్నది మాత్రం ఆసక్తికరంగా ఉంది. అదే జరిగితే సిక్కోలు చరిత్రలోనే కాదు. ఏపీలో కూడా అదో చరిత్ర అవుతుంది. వైసీపీలో చూసుకుంటే కిల్లి కృపారాణికి సహకారం ఉంటుంద్నా అన్న దానిపైన కూడా చర్చ సాగుతోంది. కిల్లికి, అదే పార్టీలో ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావుల మధ్యన వర్గ పోరు ఉందంటారు. కాంగ్రెస్ నుంచి ఈ ఇద్దరు వేరు వేరుగానే రాజకీయం చేస్తూ వచ్చారు. అసలు కిల్లి ఇన్నాళ్లూ వైసీపీలోకి రాకపోవడానికి ధర్మాన గ్రూప్ రాజకీయాలు కూడా కారణమని కూడా అంటారు. అయితే ఇపుడు ఆమె వైసీపీలోకి వచ్చేశారు. జగన్ దే ఫైనల్ డెసిషన్ కాబట్టి ధర్మాన ఏమీ అనకలేకపోవచ్చు కానీ పూర్తి స్థాయిలో ఆమె విజయానికి సహకరిస్తారా అన్నదే ఇక్కడ పాయింటు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్ధి గా పోటీ చేసిన రెడ్డి శాంతి ఓడిపోవడానికి ధర్మాన సహాయ నిరాకరణ ప్రధాన కారణమని బలమైన ఆరోపణలు ఉన్నాయి. పైగా ఇక్కడ పార్టీల కంటే కులాలే ముఖ్యం. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఎర్రన్నాయుడు కుటుంబం ధర్మాన‌ కుటుంబాల మధ్యన సాన్నిహిత్యం ఎక్కువగా ఉందంటారు. మరి చూడాలి కిల్లి రాకతో వైసీపీలో ఎలాటి పరిణామాలు వస్తాయో.

Related Posts