యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలుపు తీరాలకు చేరాలని తపిస్తున్న కేంద్రంలోని అధికార బిజెపి మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకునే పని మొదలెట్టేసింది. ఇప్పటికే రైతులకు కిసాన్ సమ్మాన్ ద్వారా 12 కోట్ల మందికి నగదు నేరుగా వారీ బ్యాంక్ అకౌంట్లకు బదిలీ కి శ్రీకారం చుట్టిన మోడీ ప్రభుత్వం మిగిలిన వర్గాలను మచ్చిక చేసుకునేందుకు వేగంగా అడుగులు వేస్తుంది. ఈబిసి లకు రిజర్వేషన్లు ప్రకటించడం ద్వారా కులాల ఓట్లకు దేశవ్యాప్తంగా బిజెపి గాలం వేసింది. ఈ నేపథ్యంలోనే మధ్యతరగతికి గుది బండగా మారిన జిఎస్టీని మరింత తగ్గించి పేద, మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు ఊరట కలిగించే నిర్ణయం ప్రకటించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. సొంత ఇంటి కల కలగా మిగిలి పోకుండా ఆ వర్గాలకు ఉపశమనం కలిగించింది.ప్రస్తుతం అందుబాటులో వుండే గృహాలకు ఇప్పటివరకు ఎనిమిది శాతం జీఎస్టీ ఉండేది. అయితే ఈ స్థానంలో ఇప్పుడు ఒక్క శాతం పన్ను చెల్లిస్తే చాలన్న నిబంధన మార్చి 1 నుంచి అమలు చేయనుంది కేంద్ర ప్రభుత్వం. అదే విధంగా నిర్మాణంలో వున్న గృహాలకు ఇప్పటి వరకు 12 శాతం పన్ను చెల్లించాలిసి వచ్చేది. తాజాగా ఈ పన్నును జైట్లీ ఐదు శాతానికి పరిమితం చేశారు. నలభై ఐదు లక్షల రూపాయల లోపు కొనుగోలు, అమ్మకాలకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది.దేశంలో అందరికి ఇళ్ళు అనే కార్యక్రమంలో భాగంగా ఆర్ధికమంత్రి ఈ ప్రకటన చేశామని తెలిపారు. ఇక మెట్రో నగరాలు పట్టణాల్లో మధ్యతరగతి వర్గాలపై మరో వరం ప్రకటించింది కేంద్రం 60 నుంచి 90 చదరపు అడుగులు వున్న వారికి పన్ను రాయితీని కూడా కేంద్రం ప్రకటించడం గమనిస్తే ఎన్నికల వాతావరణం ప్రస్ఫుటిస్తుంది. 33 వ జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో తీసుకున్న ఈ కీలక నిర్ణయాలు మాత్రం రియల్ ఎస్టేట్ రంగాన్ని మరోసారి పైకి లేపుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.