యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పుల్వామాపై దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి చేసింది. దెబ్బకు దెబ్బ తీస్తూ.. ముష్కర మూకల్ని అంతం చేసింది. నియంత్రణ రేఖ వెంబడి ఉగ్ర శిబిరాలపై భారత్ బాంబుల వర్షం కురిపించి శత్రు స్థావరాలను మట్టుబెట్టింది. పాక్ భూభాగంలోని బాలాకోట్ ఉగ్రవాద శిక్షణ శిబిరంపై తెల్లవారుజామున మిరాజ్-2000 యుద్ధ విమానాలతో దాడిచేసింది. ఈ దాడుల్లో దాదాపు 300 మంది తీవ్రవాదులు హతమయ్యారని తెలుస్తోంది. దాయాది దేశంపై మెరుపు దాడుల్ని యావత్ భారతం స్వాగతిస్తోంది. పార్టీలకు అతీతంగా నేతలంతా వాయుసేనకు ప్రశంసలు కురిపిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా వాయుసేనకు సెల్యూట్ అంటూ ట్వీట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షడు రాహుల్‌తో పాటూ జాతీయ పార్టీల నేతలు ట్వీట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన నేతలు కూడా పాక్‌కు సరైన గుణపాఠం చెప్పారంటూ స్పందించారు. భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేసి పాకిస్థాన్ లో విలీనం చేయడమే ప్రధాన లక్ష్యంగా ఏర్పడింది జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ. పాకిస్థాన్ కేంద్రంగా ఈ సంస్థ ఏర్పడింది. జైషే మహ్మద్ అంటే మహమ్మద్ యొక్క సైన్యం అని అర్థం. 2000 సంవత్సరంలో ఈ సంస్థను మౌలానా మసూద్ అజార్ స్థాపించాడు. అంతకుముందే అతడిని భారత్ అరెస్టు చేసింది. అయితే, 1999 డిసెంబర్ లో నేపాల్ లోని కాట్మాండు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని తాలిబన్లు హైజాక్ చేసి అఫ్ఘనిస్థాన్ లోని కాందహార్ కు మళ్లించారు. విమానంలోని ఓ భారత పౌరుడిని హతమార్చి భారత్ కు హెచ్చరిక పంపించారు. భారత్ ఆధీనంలో ఉన్న ముగ్గురు తమ వారిని విడిచిపెట్టాలని డిమాండ్ చేశారు. సాధారణ పౌరుల ప్రాణాలను కాపాడేందుకు గానూ అప్పటి కేంద్ర ప్రభుత్వం ముగ్గురు ఉగ్రవాదులను వదిలిపెట్టింది. ముగ్గురిలో ఒకడే మసూద్ అజార్. అతడు పాకిస్థాన్ కి వెళ్లాక జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించాడు.అప్పటి నుంచి భారతదేశంలో అనేక ఉగ్రవాద దాడులకు జైషే మహ్మద్ పాల్పడింది. ఈ సంస్థకు పాకిస్థాన్ ఐఎస్ఐ సహకారం ఉంది. పాకిస్థాన్ సైన్యం ఈ సంస్థకు సహకరిస్తోంది. కశ్మీర్ ను పాకిస్థాన్ లో విలీనం చేయడం, తర్వాత భారత్ లోని మిగతా ప్రాంతాల్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. పాకిస్థాన్ సహకారం పరోక్షంగా జైషే మహ్మద్ సంస్థకు ఉన్నా… బయటకు మాత్రం ఈ సంస్థను పాకిస్థాన్ 2002లోనే నిషేదించడం గమనార్హం. భారత్ తో పాటు ఆస్ట్రేలియా, కెనెడా, రష్యా, యూఏఈ, యూకే, అమెరికా వంటి దేశాలు కూడా జైషే మహ్మద్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా వందలాది మందికి నిత్యం ఈ సంస్థ ఉగ్రవాద శిక్షణ ఇస్తోంది. అనంతరం కశ్మీర్ ద్వారా భారత్ లోకి ఉగ్రవాదులను పంపించి ఇక్కడ విధ్వంసం సృష్టిస్తోంది. తాలిబన్లు, అల్ ఖైదాతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న ఈ సంస్థ భారత్ లో పలు దాడులకు పాల్పడి విధ్వంసం సృష్టించింది.2000 ఏప్రిల్ 20న కశ్మీర్ లో భారత బలగాలను లక్ష్యంగా చేసుకొని మొదటి ఆత్మహుతి దాడి చేసింది ఈ సంస్థ. ఇందులో ఐదుగురు భారత జవాన్లు మృతిచెందారు. తర్వాత జమ్ము కశ్మీర్ అసెంబ్లీపై దాడి, భారత పార్లమెంటుపై దాడి, పఠాన్ కోట్, పుల్వామా దాడులను జైషే మహ్మద్ సంస్థ చేయించింది. ఈ సంస్థపై, వ్యవస్థాపకుడు మసూద్ అజార్ పై చర్యలు తీసుకోవాలని పాక్ ను భారత్ అనేకమార్లు కోరింది. ఆధారాలు కూడా సమర్పించినా పాక్ స్పందించలేదు. దీంతో పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత్ నేరుగా రంగంలోకి దిగింది. మసూద్ అజార్ బావమరిది యూసఫ్ అజార్ నేతృత్వంలో పీఓకేలో నడిచే జైషే మహ్మద్ ఉగ్రవాద కాంపులను లక్ష్యంగా చేసుకొని వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 300కు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.