యువ్ న్యూస్ జనరల్ బ్యూరో: పుల్వామా దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మరోసారి సర్జికల్ దాడులు చేపట్టి.. పాక్ భూభాగంలోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత వైమానిక దళం రెప్పపాటులో దాడి చేయడంతో సుమారు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. 12 మిరాజ్ యుద్ధ విమానాలు 1000 కిలోల బరువైన బాంబులను జారవిడచడంతో.. ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నామరూపాల్లేకుండా ధ్వంసమయ్యాయి. పాకిస్థాన్‌కు తగిన బుద్ధి చెప్పిన భారత వైమానిక దళంపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్-2పై క్రీడాకారులు, సినీతారలు స్పందిస్తున్నారు. భారత్ దెబ్బేంటో రుచి చూపించారని ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మా మంచితనాన్ని బలహీనత అనుకోవద్దు. సెల్యూట్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, జై హింద్ అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ ట్వీట్ చేశాడు. బాయ్స్ హావ్ ప్లేయ్‌డ్ రియల్లీ వెల్ అంటూ వీరేంద్ర సెహ్వాగ్ తనదైన స్టయిల్లో ట్వీట్ చేశాడు. భారత్ సత్తా ఏంటో చాటారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఎప్పటికీ గర్వకారణం అంటూ హర్భజన్ సింగ్ సోషల్ మీడియాలో తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. పుల్వామా దాడి ఘటన తర్వాత.. ఇక యుద్ధమే అంటూ ఘాటుగా స్పందించిన గౌతమ్ గంభీర్.. జై హింద్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఇండియా స్ట్రైక్స్ బ్యాక్ అని ట్వీట్ చేశాడు.