యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
హైదరాబాద్‌లో సైబరాబాద్‌ను సృష్టించినట్టే విశాఖ శివారులో క్లౌడ్ సిటీని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. విశాఖ నుంచి భోగాపురం వరకు ప్రత్యేకంగా మరో కొత్త నగరాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళికతో ముందుకెళుతున్న ప్రభుత్వం పచ్చని కొండలు, విశాలమైన రోడ్డు, సముద్రతీరం కలిగిన విశాఖ శివార్లో 1,350 ఎకరాల్లో ఈసిటీని నిర్మించబోతోంది. దేశంలోనే సముద్రం మీదుగా విమా నం ల్యాండ్ అయ్యే అవకాశం ఒక్క భోగాపురం విమానాశ్రయంలో ఉండటం ప్రత్యేక ఆకర్షణగా ఉంది. అదే విధంగా విశాఖ పట్ట ణంలోని కాపుల ప్పాడులో ఏర్పాటవుతన్న అదానీ డేటా సెంటర్ పార్క్ కోసం అదాని గ్రూప్ 20ఏళ్లలో దాదాపు రూ.70వేల కోట్లు పెట్టుబడి పెట్ట నుంది. 28వేల మందికి ప్రత్యక్షంగా, 85వేలమందికి పరోక్షంగా ఉద్యోగాలు రానున్నాయి. విశాఖపట్టణంలోని కాపులప్పాడులోని 500 ఎకరాల్లో మూడు ప్రాంతాల్లో 1గిగా వాట్ డేటా సెంటర్ ఏర్పాటు కానుంది. ఇప్పటికే శంకుస్థాపన కార్యక్రమాలు పూర్తి చేసేకున్న ఈసెంటర్ ప్రపంచంలోనే మొట్టమెదటి పర్యావరణహిత డేటా సెంటర్ పార్క్‌గా చరిత్రలో నిలిచిపోనుంది. దీనిలో భాగంగానే 5గిగా వాట్స్ సోలార్ పార్క్‌ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈడేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్‌కి ఇంటర్నెట్ సేవలు అందించే కీలక కేంద్రంగా మారనుంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అనేక ఐటీ కంపెనీలు, డేటా సెంటర్లు, హార్డ్ వేర్ సప్లయిర్స్, సాఫ్ట్‌వేర్, స్టార్టప్, టెలికాం కంపెనీలు పెద్ద ఎత్తున రాష్ట్రానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.ఇది ఇలా ఉంటే, మధురువాడ హిల్ నెంబర్ 3లో నిర్మాణం పూర్తి చేసుకున్న మిలీనియం టవర్‌ని ఈమధ్యకాలంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. రూ.145కోట్లతో నిర్మించిన ఈమిలీనియం టవర్ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా ఏడు అంతస్తులుగా నిర్మించారు. 2లక్షల స్క్యేర్ ఫీట్ల విస్తీర్ణంలో అత్యంత సుందరంగా రూపుదిద్దుకున్న ఈటవర్ తొలిదశలో 1600 మంది ఉద్యోగులతో ప్రారంభమై ఏడాదిలోగా 4500మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇప్పటికే విశాఖలో పలు ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు కల్పించి, కంపెనీలకు అనుగుణంగా పాలసీలు రూపొందించి పెట్టుబడులను ఆహ్వానిస్తోంది. దీంతోపాటు మంత్రి లోకేష్ దేశంతోపాటు ఇతర దేశాల్లో పర్యటించి ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఉండే అవకాశాలను వివరిస్తూ కంపెనీలను ఏపీకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ఐటీ కంపెనీలు ఏపీలో పలు ప్రాంతాల్లో పెట్టుబడులు పెడుతున్నప్పటికీ అనుకూల వాతావరణం ఉండే విశాఖపట్టణంలో ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.