యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలిసింది. తన అనుచరులు, అభిమానులతో చర్చించి తదనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఆయన మంగళ, బుధవారాల్లో గ్రామీణ ప్రాంతంలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారితో చర్చలు జరపనున్నారు. అనకాపల్లి క్యాంప్ కార్యాలయంలో నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, మాడుగుల అసెంబ్లీ నియోజకవర్గాలు; బుధవారం పాయకరావుపేట, ఎలమంచిలి, తదితర నియోజకవర్గాల నాయకులతో ఆయన సమావేశం కానున్నారు. ఏ పార్టీలో చేరాలన్న నిర్ణయానికి సంబంధించి కొంత కాలంగా టీడీపీ, వైసీపీల వైపు నుంచి జరుగుతున్న పరిణామాలు, ఏ పార్టీలో ఎటువంటి పరిస్థితులు నెలకొంటాయి, తదితర అంశాలను తన అనుచరులకు వివరించే అవకాశం ఉంది.అయితే తన నిర్ణయానికి అనుచరుల ఆమోద ముద్ర తీసుకుంటారా? లేక అనుచరుల అభిప్రాయాల మేరకు తగిన నిర్ణయం తీసుకుంటారా? అనేది వేచి చూడాలి. విశాఖలో సోమవారం కొంత మంది ముఖ్య అనుచరులతో కొణతాల సమావేశమై రెండు రోజులపాటు అభిప్రాయ సేకరణ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. టీడీపీలో చేరే విషయమై ఆయన ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రితో చర్చలు జరిపారని స్వయాన మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా వెల్లడించారు. ఈనెల 22వ తేదీన ముఖ్యమంత్రి నుంచి అందిన ఆహ్వానం మేరకు 28న అమరావతిలో చంద్రబాబును కలవనున్నారు. అదే రోజు పార్టీలో చేరికకు సూచనగా చంద్రబాబు చేత పార్టీ కండువా కప్పించుకుని, త్వరలో అనకాపల్లిలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు చేసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో అధికారికంగా చేరే అవకాశం ఉందని తెలిసింది.