యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
విశాఖ శివారు స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో సారాగా భావించి రసాయనాన్ని సేవించి మరణిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఈ ఘటనలో ఆదివారం ముగ్గురు మృతిచెందగా.. మంగళవారం ఇద్దరు.. చనిపోయారు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న మరో 12 మందిలో బుధవారం మరో నలుగురు మృతి చెందారు. వీరిలో ఎ. చిన్నారావు (50), బి. అంకమ్మ (45), ఎ.రమణమ్మ (57), ఎ.రమణమ్మ (59) ఉన్నారు. కాగా, రసాయన మృతుల సంఖ్య తొమ్మిదికు చేరుకుంది. ప్రస్తుతం కేజీహెచ్‌లో 9 మంది చికిత్స పొందుతున్నారు. వీరి ఆరోగ్య పరిస్థితి సైతం రోజురోజుకూ క్షీణిస్తుండడంతో నెఫ్రాలజీ వార్డుకు ఇద్దరిని, ఎమర్జెన్సీ మెడికల్ విభాగానికి ఇద్దరిని తరలించి అత్యవసర వైద్యం అందిస్తున్నారు. వీరు సేవించిన రసాయనం శరీరంలో అన్ని భాగాలకు విస్తరించడంతో ప్రాణాపాయ స్థితికి చేరుకునే ప్రమాదం ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో వీరందరికీ ఐసీయూలో ఉంచి డయాలసిస్ చేస్తున్నారు. తెల్లారి లేచింది మొదలు చీకటి పడే వరకు వారికి ఒకటే తపన. ఎవరికీ అక్కర్లేని చెత్త, చెదారాన్ని వారు అక్కున చేర్చుకుంటారు. దానిపై వచ్చే అరకొర ఆదాయంతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. తాము చేపట్టిన వృత్తి దుర్భరమని తెలిసినా అందులోనే నిత్యం కొట్టుమిట్టాడుతున్నారు. రోజంతా పడ్డ శ్రమకు మత్తు నుంచి ఉపశమనం లభిస్తుందని తాగుడుకు అలవాటు పడ్డారు. ఆ అలవాటే ముగ్గురిని బలితీసుకుంది. మరికొందరిని చావుబతుకుల్లోకి నెట్టేసింది. పెదగంట్యాడ మండలం స్వతంత్రనగర్ ఎస్టీ కాలనీలో చోటు చేసుకున్న విషాదం వెనక మత్తు ఉండడం.. మృతుల్లో ఇద్దరు అన్నాచెల్లెళ్లు ఉండడం మరింత కలచివేసింది. ఎస్టీ కాలనీలో సంచార జాతుల తెగకు చెందిన కుటుంబాలు అధిక శాతం నివసిస్తున్నాయి. పురుషులు చిన్న చిన్న కూలిపనులు, పందుల పెంకపం వ్యాపకంగాను, మహిళలు చెత్తల్లోనుంచి విక్రయానికి ఉపయోగపడే వ్యర్థాలను సేకరిస్తుంటారు. ఈ తెగలో పురుషులతో పాటు మహిళలు కూడా మద్యం సేవిస్తుంటారు. కాలనీకి సమీపంలో ఉన్న జీవీఎంసీ డంపింగ్ యార్డులో వ్యర్థాల సేకరణకు కోసం వెళ్లిన వాడపల్లి అంకమ్మకు అక్కడికి సమీపంలోనే పది లీటర్ల క్యాన్‌తో ఒక రకమైన రసాయన ద్రావకం దొరికింది.దాన్ని ఇంటికి తీసుకొచ్చిన ఆమె అందులో ఉన్నది సారా అని భావించింది. చాలా కాలం క్రితం ఈ కాలనీవాసులు నాటుసారా తెచ్చుకొని సేవించేవారు. దీంతో ఈ ద్రావకం కూడా సారా అని, దాన్ని ఎవరో అక్కడ వదిలేసి వెళ్లిపోయి ఉంటారని భావించింది. ఆ ద్రావకాన్ని శనివారం రాత్రే కాలనీలో ఉన్న తమ బంధువులు, పక్కవాళ్లకు పంచింది. సుమారు 20 మంది దానిని సేవించారు. నిద్ర లేచే సమయానికి వారందరికీ కడుపులో మంట మొదలైంది. కొందరికి వాంతులయ్యాయి. రాత్రి తాగిన సారాలో పవర్ ఎక్కువగా ఉండి ఉంటుందని వారు భావించారు. వారిలో పెండ్ర అప్పలమ్మ మంచంపై నుంచి లేవలేదు. ఇంట్లో కుటుంబ సభ్యులు పిలిచినా ఆమె సరిగా స్పందించకపోవడంతో మత్తు ఎక్కువై ఉంటుందని, అప్పటికే తమ ఇంట్లో ఉన్న మద్యాన్ని కూడా సేవించి ఉంటుందని భావించారు. చివరకు ఉదయం 10 గంటలు దాటినా ఆమె నుంచి చలనం లేకపోవడంతో మృతి చెందిందని నిర్ధారించి దహన సంస్కారాలు కూడా నిర్వహించారు. మద్యం తాగడం ఆమె చివరి కోరిక అయి ఉండవచ్చని, ఇప్పుడు సారా తాగడంతో కోరిక తీరి మృతి చెందిందని భావించారు. ఈ క్రియ ముగిసేలోగా ఆమె సోదరుడు వాడపల్లి అప్పడు, ఆ కాలనీకి చెందిన ఆసనాల కొండోడు కూడా అస్వస్థతకు గురయ్యారు. ఆయనదీ రాత్రి తాగిన మద్యం ప్రభావమేననుకున్నారు. మరో కొద్ది సేపటికి అప్పడు పెద్ద కోడలు వాడపల్లి అంకమ్మ కూడా అస్వస్థతకు గురై వాంతులు కూడా అయ్యాయి. వాంతి నుంచి బయటకు వచ్చిన కెమికల్ పడ్డ నేల నల్లటి పొగ మాదిరిగా మారిపోవడంతో ఆమెను గాజువాకలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు చికిత్స మొదలైన కొద్దిసేపటికి ఆమె మామ వాడపల్లి అప్పడు, ఆసనాల కొండోడు చనిపోయారు. వీరితో పాటు అస్వస్థకు గురైన 11 మందిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో రమణమ్మ, చిన్నారావు, అంకమ్మల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.గాజువాక స్వంతంత్రనగర్‌లో నాటుసారా అని భ్రమపడి పరిశ్రమల్లో వాడే రసాయనాన్ని తాగి అస్వస్థతకు గురైన బాధితులు కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. బాధితులు, బంధువుల ఆర్తనాదాలతో ఆస్పత్రి మిన్నంటింది. ద్రవాన్ని తాగిన సుమారు 20 మందిలో ఆదివారం ఉదయం 6 గంటల సమయంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బంధువులు ద్రవం తాగిన మిగతా 11 మందిని కేజీహెచ్‌కు తరలించారు. వీరిలో ఆసనాల కొండయ్య మార్గమధ్యలో చనిపోయాడు. ఆసనాల చిన్న, ఆసనాల రమణమ్మ పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స అందిస్తున్నారు. మిగతా ఎనిమిది మంది బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.అర్జున తెలిపారు. ఆస్పత్రికి వచ్చిన కలెక్టర్ కాటమనేని భాస్కర్ బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను ఆయన ఆదేశించారు. పోలీసు, ఎక్సైజ్ అధికారులతో ఘటనపై విచారణ చేపడతామని తెలిపారు. ఆస్పత్రికి చేరుకున్న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధితులు తాగింది మద్యం కాదని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పరిశ్రమల్లో వాడే రసాయనంగా అనుమానిస్తున్నామని, పరీక్ష నిమిత్తం ద్రవాన్ని ల్యాబ్‌కు పంపామని, సోమవారం ఉదయానికి పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పారుసంఘటనతో వివిధ ప్రభుత్వ విభాగాల అధికారులు ఎస్టీ కాలనీలో పర్యటించారు. మృతులు, బాధితులు సేకరించిన కెమికల్‌పై ఆరా తీశారు. పది లీటర్ల క్యాన్‌తో ఉన్న రసాయన ద్రావకంలో ప్రస్తుతం మూడు లీటర్లే మిగిలి ఉందని, ఏడు లీటర్ల ద్రావకాన్ని 11 మంది సేవించారని సౌత్ ఏసీపీ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బాధితులు సేవించింది మద్యం కాదని, ఉడ్ బర్నింగ్‌కు ఉపయోగించే కెమికల్ అయి ఉంటుందని అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్ ఆర్.ప్రసాద్ తెలిపారు. పూర్తి స్థాయి నివేదిక సోమవారం వస్తుందని చెప్పారు. గాజువాక సీఐ కె.రామారావు, గాజువాక ఎక్సైజ్ సీఐ ఉపేంద్ర, గాజువాక పీహెచ్‌సీ వైద్యాధికారి తమ సిబ్బందితో సహా కాలనీలో పర్యటించి సంఘటకు గల కారణాలపై విచారణ చేపట్టారు.