యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
పుల్వామా దాడికి భారత్ కసితీరా ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా వైమానిక దాడులు చేపట్టి 300 మందికిపైగా ఉగ్రవాదులను ఏరివేసింది. ఎయిర్ ఫోర్స్ దాడుల చేపట్టిన విషయం తెలియగానే ప్రతి భారతీయుడి గుండె ఆనందంతో ఉప్పొంగింది. ప్రపంచ దేశాలు కూడా భారత్‌కు బాసగా నిలుస్తున్నాయి. ఈ క్రమంలో సర్జికల్ స్ట్రైక్స్-2గా అభివర్ణిస్తోన్న ఎయిర్ స్ట్రైక్స్ కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా? జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ఘాటైన సమాధానం ఇవ్వడం కోసం భారత్ చేసిన ఖర్చు కేవలం రూ.1.68 కోట్ల నుంచి రూ.2.2 కోట్లు మాత్రమే. బాలాకోట్, ముజఫరాబాద్, చకోటి ప్రాంతాల్లో ఉగ్రస్థావరాలపై 1000 కిలోల బాంబులను ఐఏఎఫ్ జారవిడించింది. ఒక్కో బాంబు ధర సుమారు రూ.56 లక్షలు. ఈ దాడి కోసం భారత్ రూ.3686 కోట్ల విలువ చేసే 12 మిరాజ్ 2000 విమానాలు, 3 సుఖోయ్ సు-30 ఎయిర్‌క్రాఫ్ట్‌లను వాడింది. మిరాజ్ విమానాలు పాక్ గగతనంలోకి వెళ్లగా... సుఖోయ్ విమానాలు భారత గగనతలంలోనే ఎగురుతూ వాటికి బ్యాకప్‌గా ఉన్నాయి. పాక్ తిరిగి దాడి చేస్తే రంగంలోకి దిగే ఉద్దేశంతో వీటిని ఉపయోగించారు. 5 మిగ్-29 విమానాలను కూడా ఈ దాడి కోసం ఎయిర్‌ఫోర్స్ సిద్ధం చేసింది. ఆపరేషన్ పూర్తయ్యే వరకు ఇవి పంజాబ్‌లోని అదంపూర్‌లో అప్రమత్తంగా ఉన్నాయి. వీటి ఖరీదు రూ.770 కోట్లు. పాకిస్థాన్ తిరిగి దాడి చేసే అవకాశం ఉండటంతో ఆ దేశ యుద్ధ విమానాలపై నిఘా కోసం.. ఎయిర్‌బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ ఉన్న విమానాన్ని ఉపయోగించారు. భంటిడాలోని ఎయిర్‌బేస్ నుంచి టేకాఫ్ అయిన దీని ఖరీదు రూ.1750 కోట్లు. గాల్లోనే ఇంధనం నింపే ట్యాంకర్‌ను ఆగ్రా నుంచి పంపించారు. దీని ధర రూ.22 కోట్లు. రూ.80 కోట్ల ఖరీదు చేసే హెరాన్ అనే నిఘా డ్రోన్‌ను కూడా ఉపయోగించారు. యుద్ధవిమానాల ఖరీదు, 1000 కిలోల బాంబుల ధర కలుపుకొని ఈ ఆపరేషన్ కోసం భారత్ వెచ్చించిన మొత్తం రూ.6264 కోట్లు. ఇంధనం కోసం చేసిన ఖర్చు అదనం. మిరాజ్ 2000 యుద్ధ విమానాలన్నీ బాంబు దాడులకు దిగలేదు. కొన్ని దాడి చేస్తుంటే.. మరికొన్ని ప్రత్యర్థిని కాచుకోవాలన్నది వ్యూహం. దాడి చేస్తున్న విమానాలపై పాక్ ఎయిర్‌ఫోర్స్ ప్రతిదాడులకు దిగితే.. వాటిని నిలువరించడం కోసం మిగతా యుద్ధ విమానాలు మిస్సైల్స్‌తో రెడీగా ఉన్నాయి. పక్కా స్కెచ్‌తో దాడి చేసిన భారత యుద్ధ విమానాలు.. వేకువ జామున 3.45 నుంచి 4.04 గంటల మధ్య బాంబులు జారవిడిచి తిరిగి వెనక్కి వచ్చేశాయి.