యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కాకినాడ టీడీపీ ఎంపీ తోట నరసింహం వ్యవహారం ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు చిర్రెత్తుకొచ్చేలా చేస్తొందంట. అనారోగ్యం రీత్యా తాను రాజకీయాలకు దూరంగా ఉంటానని, వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయలేనని చంద్రబాబుకు విన్నవించిన ఆయన జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టికెట్‌ను మాత్రం తన భార్యకు కేటాయించాలని మెలికపెట్టారు. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 2004,2009లో గెలిచారు. మంత్రి కూడా పనిచేశారు. అయితే 2014లో టీడీపీ నుంచి కాకినాడ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న ఆయన తన భార్యకు జగ్గంపేట అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. టీడీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచిన సిట్టింగ్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను కాదని తోట నరసింహం కుటుంబ సభ్యులకు టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖంగా లేరు.తన భార్య సీటు కోసం విన్నవించి చాలా రోజుల గడిచినా చంద్రబాబు నుంచి సరైన స్పందన లేదని అనుచరులతో అన్నారని సమాచారం. అందుకే వైసీపీలో చేరేందుకు తోట నరసింహం ఆయన కుటుంబం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. వైసీపీలోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్న ఆయన టీడీపీ టికెట్ ఇవ్వనందునే తాను పార్టీ మారినట్లు చెప్పుకోవడానికి ఓ బలమైన కారణం కార్యకర్తల వద్ద ఉంటుందనేది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ ముఖ్యనేత బొత్స సత్యనారాయణతో రెండు మార్లు భేటీ అయినట్లు సమాచారం. దాదాపు గంట పైనే మంతనాలు జరిపిన తోట నరసింహం, బొత్స సత్యనారాయణలు, జగన్‌తో ఫైనల్‌గా చర్చించి క్లారిటీ ఇస్తామని చెప్పనట్టు తెలుస్తోంది. దీంతో మరో టీడీపీ కీలక నేత వైసీపీ తీర్ధం పుచ్చుకోవడం ఖాయమని దాదాపుగా తేలిపోయినట్టైంది. ఏది ఏమైనా మరోసారి వైసీపీలోకి వలసలు స్టార్ట్ కానున్నాయని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు.వాస్తవానికి జగ్గంపేట వైసీపీ కోఆర్డినేటర్‌గా ఉన్న ముత్యాల శ్రీనివాస్‌ని తప్పించి చంటిబాబుకి పదవి ఇచ్చారు. ఇప్పుడు తోట నరసింహం భార్య వాణి పార్టీలో చేరితే చంటిబాబుని తప్పించి ఆమెకి నియోజకవర్గ సమన్వయకర్త పగ్గాలు ఇచ్చే అవకాశాలు ఉన్నట్టు ప్రచారం సాగుతోంది.అయితే జగ్గంపేట వైసీపీ సమన్వయకర్తగా ఉన్న జ్యోతుల చంటిబాబును తప్పించి వాణికి టిక్కెట్టు ఇస్తారా? అనేది కూడా అపనమ్మకమే అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జ్యోతుల నెహ్రూ వైసీపీ నుంచి టీడీపీలో చేరిన తర్వాత చంటిబాబు తనకు టిక్కెట్టు రాదని తెలిసి వైసీపీలో చేరారు. తోట నరసింహం కుటుంబ రాజకీయ భవిష్యత్ మరికొద్దిరోజులు ఆగితే గాని తేలదనే చెప్పాలి. ఏదేమైనా జగ్గంపేట అసెంబ్లీ సీటుపై జగన్ క్లారిటీ ఇవ్వడమే ఆలస్యం తోట ఫ్యామిలీ పార్టీ కండువా మార్చేందుకు రెడీగానే ఉంది