యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
భద్రతా పరమైన అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీ ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన మోదీ తన ప్రసంగాన్ని మధ్యలోనే నిలిపివేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. భారత్ భూభాగంలోకి పాక్ యుద్ధ విమానాలు చొచ్చుకొని వచ్చినట్లు వార్తలు రావడంతో వెంటనే దీనిపై చర్చించేందుకు ఆయన అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు. నేషనల్ యూత్ ఫెస్టివల్ 2019 కార్యక్రమానికి హాజరైన మోదీ విద్యార్థులతో మాట్లాడుతుండగా పీఎంవో కార్యాలయానికి చెందిన ఓ అధికారి చిన్న పేపర్‌ను తీసుకొచ్చి ఆయనకు ఇచ్చారు. దీంతో వెంటనే మోదీ తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెంటనే వేదిక దిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు.మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా సరిహద్దు భద్రతపై సమీక్షించారు. నార్త్ బ్లాక్‌లో రాజ్‌నాథ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారత్-పాక్ సరిహద్దులో ఉన్న భద్రతా దళాలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనకు జరగకుండా చూసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.కాగా భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చివేశామని, ఒక పైలెట్‌ను అదుపులోకి తీసుకున్నామని పాక్ చెబుతోంది.