యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల్లో 20 వేల మెజార్టీతో టీడీపీని గెలిపించే బాధ్యత తనదేనని స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీకి డిపాజిట్లు కూడా రావన్నారు.
తాను రెండు నియోజకవర్గాల్లో చేసిన అభివృద్ధే విజయాన్ని చేకూరుస్తాయన్నారు. రాష్ట్రంలో టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. రాష్ట్రంలో 150 స్ధానాలకు పైగా టీడీపీ గెలుస్తుందన్నారు. వైసీపీ నీతిబాహ్యమైన కార్యక్రమాలు చూస్తుంటే భాదేస్తుందన్నారు. వైసీపీ నేతలు చేస్తున్న అవినీతి, ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ 35 సంవత్సరాల రాజకీయాల్లో నిప్పులాగా బతికానని, బతుకుతున్నానని కోడెల అన్నారు.
తమపై వైయస్ జగన్, అంబటి రాంబాబు చేసిన ఆరోపణలకు బహిరంగ చర్చకు జగన్ ఎక్కడకు వచ్చినా తాను సిద్ధమన్నారు. కేంద్రం సపోర్టు ఉందని, పక్క రాష్ట్రం ఉందని భ్రమలు పడుతున్నారన్నారు. ఎవరూ ఏమీ చేయలేరని ప్రజల మద్దతు తెలుగుదేశానికి ఉందన్నారు.