యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నేపాల్ పర్యాటక, పౌరవిమానయాన శాఖ మంత్రి రబీంద్ర అధికారి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడిక్కడే మృతి చెందారు. మంత్రితో పాటు మరో ఐదుగురు హెలికాప్టర్‌లో ఉన్నారు. హెలికాప్టర్ ప్రమాదంలో మంత్రి చనిపోయిన విషయాన్ని ఆ దేశ విమానయానశాఖ ధ్రువీకరించింది. పఠిభర ప్రాంతంలో ఈ చాపర్ కూలిపోయింది. కెప్టెన్ ప్రభాకర్, టూరిజంయ ఎంటర్‌ప్రెన్యూర్ అంగ్ ఛిరాంగ్ శ్రేప, సెక్యూరిటీ పర్సనల్ అర్జున్, ప్రధానమంత్రి సన్నిహితుడు యుబ్రార్ దాహల్, బీరేందర శ్రేష్టతో పాటు మరో వ్యక్తి ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.పెద్ద శబ్దంతో విమానం కూలిపోయిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి రెస్క్యూ సిబ్బంది చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పఠిభర ప్రాంతంలోని ఆలయంలో పూజలు నిర్వహించి కాఠ్‌మాండూ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. అయితే.. చాపర్ కూలిపోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. తొలుత చాపర్ అదృశ్యమైనట్లు వార్తలు వచ్చాయి. అనంతరం కొద్దిసేపటికి స్థానికులు పఠిభర ప్రాంతంలో హెలికాప్టర్ కూలడంతో పెద్ద ఎత్తున పొగలు వస్తున్నట్లు అధికారులకు సమాచారం అందించారు.