యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఈజిప్టు రాజధాని కైరోలోని రామ్సెస్ రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చిన రైలు.. ప్లాట్‌ఫాం గోడను ఢీకొట్టడంతో.. ఇంధనం ట్యాంకులో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో అక్కడున్న ప్రయాణికులంతా పరుగులు పెట్టారు. మొత్తానికి ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 2017 ఆగస్టులో మెడిటెర్రేనియన్ పోర్టు సిటీలో రెండు ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 43మంది మృతి చెందారు. 100మందికి పైగా గాయపడ్డారు. 2002లో కైరోకు సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో 370 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.