Highlights
- బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు ఎప్పుడైనా పెటాకులేనా ..?
- తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరచొద్దు
- ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయింది
- తేల్చిచెప్పిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లూ ప్రత్యేక హోదాపై ఏ వైఖరి ప్రకటించలేక తర్జనభర్జన పడిన చంద్రబాబు తాజాగా హోదా ఇచ్చి తీరాల్సిందేనని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ప్రత్యేక హోదాతో సమానంగా సాయం చేస్తామంటేనే ఆరోజు ప్యాకేజీకి ఒప్పుకున్నానని, కానీ కేంద్రం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇతర రాష్ట్రాలకిస్తున్నప్పుడు ఏపీకి కూడా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లానని, విభజన హామీలు అమలుచేయాలని కోరానని చంద్రబాబు చెప్పారు. రాజ్యసభలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేసి ఉంటే ఇప్పటికే ఏపీ అభివృద్ధి చెంది ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్రానికి కేంద్రం అరకొర సాయం మాత్రమే చేసిందని చంద్రబాబు ఆరోపించారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కించపరచొద్దని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. అయితే ఈ సందర్భంగా వైసీపీకి కూడా చంద్రబాబు చురకలంటించారు. కొన్ని పార్టీలు కేంద్రాన్ని కాకుండా తనను టార్గెట్ చేస్తున్నాయని వైసీపీ పై చంద్రబాబు పరోక్ష విమర్శలు చేశారు. రాష్ట్రం కోసం కష్టపడే ఏ పార్టీనైనా అభినందిస్తానని చంద్రబాబు చెప్పారు.
ఏపీకి విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు ఎప్పుడైనా పెటాకులు అవుతుందనే ప్రచారం సాగుతోంది. అందుకు తగినట్లుగా ఏపీకి చెందిన ఆ పార్టీ నేతల మధ్య తీవ్ర వాగ్యుద్ధం సాగుతోంది. నవ్యాంధ్రకు కేంద్రం సాయం అవసరమని చెబుతున్న చంద్రబాబు.. మాటల్లో ఇటీవల మార్పు కనిపిస్తోంది.