యువ్ న్యూస్ స్పోర్ట్స్ బ్యూరో:
వేదిక మారినా.. సారథి కోహ్లీ చెలరేగినా.. భారత్‌కు మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు. ఆసీస్ బ్యాట్స్‌మెన్ గ్లెన్ మాక్స్‌వెల్(113నాటౌట్; 55బంతుల్లో 7×4, 9×6) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో రెండో టీ20లోనూ భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. దీంతో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-0తో కైవసం చేసుకున్నట్లయింది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్ కేఎల్ రాహుల్(47; 26బంతుల్లో 3×4, 4×6) శుభారంభం ఇచ్చాడు. వరుస బౌండరీలు, సిక్సర్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఈ క్రమంలో అర్ధశతకం దిశగా అడుగులు వేస్తున్న సమయంలో ఎనిమిదో ఓవర్‌లో కౌల్టర్ నైల్ బౌలింగ్‌లో రిచర్డసన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఓపెనర్ ధావన్(14), రిషభ్ పంత్(1) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో ఇన్నింగ్స్ నిలబెట్టే బాధ్యత కోహ్లీ(72నాటౌట్; 38బంతుల్లో 2×4, 6×6) తీసుకున్నాడు. మాజీ సారథి ఎంఎస్ ధోనీ(40; 23బంతుల్లో 3×4, 3×6)తో కలిసి స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. ఈ జోడీ వీలుచిక్కినప్పడల్లా బౌండరీలు బాదుతూ శతక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసింది. ఈ ఇద్దరూ రాణించడంతో భారత్ నిర్ణీత 20ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 190పరుగులు చేసింది.