యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 15 ఎకరాల స్థలంలో కాటేజీలు నిర్మించేందుకు శ్రీదుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం ఈవో కోటేశ్వరమ్మ ప్రతిపాదనలు తయారు చేసి, అనుమతులు కోరుతూ ఉన్నతస్ధాయి అధికారులకు పంపారు. కృష్ణా తీరం వెంబడి 15 ఎకరాలల్లో వీఐపీ కాటేజీలను నిర్మించి, అక్కడ నుండి భక్తులను పడవలో ఎక్కించుకొని ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు తీసుకొచ్చి దుర్గమ్మ దర్శనం చేయించాలనే ఉద్దేశ్యంతో ఈవో ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కాటేజీల నుండి బయలు దేరిన భక్తులకు నదీ విహారం తర్వాత అమ్మవారి దర్శనం అంటే అటు ఆహ్లాదకరమైన వాతావరణంలో నుండి ఆధ్యాత్మిక వాతావరణంలోనికి తీసుకు వెళ్ళేందుకు ఈ ప్రణాళికను రూపొందించారు. ప్రస్తుతం దేవస్థానానికి చెందిన మాడపాటి గెస్ట్‌హౌస్, సీవీ రెడ్డి విశ్రాంతి భవనం, ఈ రెండు మాత్రమే నగరంలో ఉన్నాయి. నగరానికి వచ్చిన ప్రముఖులు, భక్తులు అమ్మవారి దర్శనంతోపాటు కృష్ణాజిల్లాలోని ప్రముఖ ఆలయాల సందర్శించుకునేందుకు వీలుగా అమరావతిలో భారీస్థాయిలో కాటేజీల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ ప్రాతిపాదనకు ప్రభుత్వం అనుమతిస్తే అటు శ్రీదుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానానికి మరింత ఆదాయం సమకూర్చటంతోపాటు విజయవాడ ప్రముఖ పర్యాటక కేంద్రంగా మారే అవకాశం ఉంది.