YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

సమస్య యథాతథం

సమస్య యథాతథం

నలుగురు జడ్జీలతో 20నిమిషాల సేపు సీజే భేటీ

కీలక కేసుల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం

రెబెల్స్‌కు దక్కని చోటు..

నలుగురు సీనియర్‌ న్యాయమూర్తుల తిరుగుబాటుతో సుప్రీంకోర్టులో రేగిన సంక్షోభం ఇంకా సమసిపోలేదు. చిన్న ఆశారేఖ ఏంటంటే.. మంగళవారం ఛీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా ఆ నలుగురితో తొలిసారి భేటీ అయ్యారు. సంప్రదాయ తేనీటి విందు ఇందుకు వేదికైంది. ఆ నలుగురు జడ్జిలు -- జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌, జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌, జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌, జస్టిస్‌ కురియన్‌ జోసెఫ్ -- లేవనెత్తిన అంశాలపై క్లుపంగా చర్చించారు. దీపక్‌ మిశ్రాయే వారిని తన ఛాంబర్‌కు పిలిపించారు. వీరితో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు- జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ సంజయ్‌ కిషన్‌ కౌల్‌ కూడా ఇరవై నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్నారు.

రోస్టర్‌ విధానం, కేసుల కేటాయింపుపై సమగ్ర చర్చ జరగకపోయినా.. నలుగురు రెబెల్‌ జడ్జీల అభిప్రాయాలను దీపక్‌ మిశ్రా తీసుకున్నట్లు అభిజ్ఞవర్గాల సమాచారం. సమావేశం అసంపూర్తిగా ముగిసిందని, నలుగురు జడ్జీలతో బుధవారం కూడా సీజే సమావేశం కావొచ్చని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. ఈ సంక్షోభం యథాతథంగా కొనసాగుతోందని జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ చాలా సూటిగా చెప్పేశారు. ‘‘ఇది వివాదం కాదు.. కేవలం ఓసమస్య. ఈ సమస్యకు ఇప్పటిదాకా పరిష్కారం మాత్రం దొరకలేదు’’ అని ఆయన ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. సోమవారానికల్లా అంతా సర్దుకుంటుందని మూడు రోజుల కిందట వ్యాఖ్యానించిన అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ కూడా తన మాటను వెనక్కితీసుకున్నారు.. కానీ తొందర్లోనే ఓ కొలిక్కివస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా.. దీపక్‌ మిశ్రా తన పంథాలోనే వెళుతున్నట్లుగా మంగళవారం నాటి మరో పరిణామం తెలియజేస్తోంది.

ఎనిమిది అత్యంత కీలకమైన కేసుల విచారణ జరిపేందుకు ఆయన ఐదుగురు సభ్యులతో ఓ రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. అందులో నలుగురు తిరుగుబాటు జడ్జీలకూ స్థానం కల్పించలేదు. ఆధార్‌ చట్టబద్ధత, స్వలింగ సంపర్కం నేరం అని చెప్పే ఆర్టికల్‌ 377 మీద ఇచ్చిన తీర్పుపై సమీక్ష, ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత, శబరిమల కోవెలలోకి 10-50 ఏళ్ల మహిళలను అనుమతించడం, పార్శీ మహిళల మతాంతర వివాహం సందర్భంలో ఆమె తన మతాన్ని కోల్పోతుందా?, అక్రమబంఽధాల విషయంలో మగవారినే శిక్షించడం ఎంతవరకూ న్యాయం... మొదలైన కేసుల్ని ఈ రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతుంది. సీబీఐ జడ్జి లోయా మృతి కేసును కూడా గతంలో ఏర్పాటు చేసిన ఇద్దరు సభ్యుల ధర్మాసనానికే అప్పగించారు. జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ ఎంఎన్‌ శంతనగౌదార్‌లు ఈ కేసు విచారణను కంటిన్యూ చేస్తారు.

మరో వారం పట్టొచ్చు: బార్‌

సమస్య పరిష్కారం మరింత సమయం తీసుకొనేట్లుందని అటు అటార్నీ జనరల్‌, ఇటు సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం (ఎస్సీబీఏ- బార్‌) అభిప్రాయపడ్డాయి. ‘‘ఇవ్వాళ్టి పరిణామాలను పరిశీలించిన మీదట సమస్య ఇంకా కొనసాగుతోందని అర్థమవుతోంది. మరో 2-3 రోజుల్లో ఓ కొలిక్కివస్తుందని ఆశిద్దాం’’ అని మీడియాతో అటార్నీ జనరల్‌ కేకే వేణుగోపాల్‌ అన్నారు. ఈయన గత మూడురోజులుగా.. అంతా తేలిపోయింది, నో క్రైసిస్‌ అంటూ మీడియాకు ఇంటర్వ్యూలిచ్చారు.

రెబెల్స్‌పై చర్యకు సీజే నో

ధిక్కార స్వరం వినిపించిన నలుగురు సీనియర్‌ న్యాయమూర్తులపై చర్య తీసుకోవాలంటూ న్యాయవాది ఆర్‌ పి లుథ్రా చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా తోసిపుచ్చారు. ‘‘ఇదో న్యాయ దేవాలయం. కొందరు వ్యక్తులు దీన్ని ధ్వంసం చేస్తూ ఉంటే ఊరుకోలేం. జాతి వ్యతిరేక శక్తుల చేతిలోకి ఇది పోకూడదు. వారిపై చర్య తీసుకోండి’’ అని లుథ్రా అన్నారు. దీనికి దీపక్‌ మిశ్రా వెంటనే ‘‘నో, నో... నాట్‌ ఏక్సెప్టబుల్‌..’’ అని కొట్టి పారేశారు.

అటు జుడీషియల్‌ అపాయింట్‌మెంట్స్‌ కమిషన్‌ బిల్లును కొట్టేస్తూ- 2015లో ఇచ్చిన తీర్పుపై సమీక్ష జరగాలని కూడా మరో పిటిషన్‌ దాఖలైంది . దీన్ని కూడా దీపక్‌ మిశ్రా తో కూడిన త్రిసభ్య బెంచ్‌ కొట్టేసింది. మెమొరాండం ఆఫ్‌ ప్రొసీజర్‌ రూపొందించడంపై నిర్దిష్ట కాలావధి నిర్ణయించలేమని బెంచ్‌ తేల్చిచెప్పింది.

Related Posts