యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఏపీ పరిస్తితి ఏంటి? ఎన్నికలకు ముందు.. తర్వాత.. ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మేధావుల మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది! వచ్చే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేతికి ఎముక లేకుండా ప్రజలపై వరాల జల్లులు కురిపిస్తున్నారు. ఇప్పటికే డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కింద రూ.10 వేల చొప్పున ఇప్పటికే 22 వేల కోట్ల రూపాయలను అందించారు. ఇక, పింఛన్లను భారీగా పెంచారు. ఇదిలావుంటే, వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన నిధులు పెంచారు. ఇలా ప్రతి విషయంలోనూ ఇప్పటికే ఎన్నికలకు ముందు ఎడాపెడా చంద్రబాబు వరాలు కురిపిస్తున్నారు.ఇక, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఒక్కసారిగా గమనిస్తే.. ఇప్పటికే 16 వేల కోట్ల లోటు బడ్జెట్‌లో ఉందని రాష్ట్ర ప్రభుత్వం చెబు తోంది. అయితే, కేంద్రం మాత్రం 4 వేల కోట్ల రూపాయల లోటు మాత్రమే ఉందని చెబుతోంది. ఈ క్రమంలోనే కొంత మేర కు డబ్బును కేటాయించింది. అయితే, చంద్రబాబు చేసిన విదేశీ ప్రయాణాలు.. ప్రభుత్వ ప్రచారం ఇలా చూసుకుంటే.. ప్రతి పనికీ ఆయన చాలా ఎక్కువగానే డబ్బులు ఖర్చు పెడుతున్నారని అంటున్నారు పరిశీలకులు. ఇక, పోలవరం, రాజ ధాని నిర్మాణాలను ప్రజలకు చూపించేందుకు వివిధ జిల్లాల నుంచి వందల సంఖ్యలో బస్సులను కేటాయించారు.ఇక, ప్రకటనల ఖర్చు అంతా ఇంతా కాదు, పుష్కరాలు వచ్చినా.. ఏ కార్యక్రమం జరిగినా ఇష్టం వచ్చిన రీతిలో చేసిన ఖర్చు కూడా భారీగానే ఉంది. ధర్మపోరాట దీక్షల పేరుతో ప్రజల సొమ్మును ఖర్చు చేశారు. ఇక, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను తనవైపు మళ్లించుకునేందుకు ప్రభుత్వ సొమ్ముతోనే ఓట్లను కొంటున్నారనే ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలోనే మహిళలకు పది వేల చొప్పున పందేరం చేస్తున్నారు. ఇలా ఎందుకు ఇస్తున్నారు? మహిళలను సాధికారులుగా చేసేందుకు వారికి ఉపాధి చూపించాల్సిన రాష్ట్రంలో వారికి డబ్బులు పందేరం చేయడం ఏంటనే ప్రశ్న వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రజలపై భారం మోపకుండా బండిని నడిపించే పరిస్థితి కనిపించడం లేదనేది వాస్తవం