జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు…? అయన స్క్రీనింగ్ కమిటీకి చేసిన దరఖాస్తులో ఒకే ఒక స్థానం నుంచి తనకు సీటు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. మరి ఆయన పోటీ చేసేందుకు ఎక్కడ ఆసక్తి చూపుతున్నారు. ఇదీ జనసేనలోనే కాకుండా ఇతర పార్టీల్లోనూ ఆసక్తికర చర్చ నడుస్తోంది. పవన్ కల్యాణ్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ప్రజారాజ్యంలో కీలక పాత్ర పోషించినప్పటికీ ఆయన పోటీ చేయలేదు. పార్టీని పెట్టి తొలిసారి పోటీ చేయడానికి సిద్ధమైన పవన్ కల్యాణ్ ప్లేస్ ఎక్కడన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనకు సీటు కేటాయించాల్సిందిగా స్క్రీనింగ్ కమిటీకి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తులో తాను ఏ జిల్లా నుంచి పోటీ చేయాల్సిందీ స్పష్టంగా పేర్కొన్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ ఏపీ విభజన తర్వాత పవన్ కల్యాణ్ తొలి పర్యటన అనంతపురంలోనే జరిగింది. అనంతపురంలో తొలి పార్టీ కార్యాలయాన్ని కూడాప్రారంభించారు. అనంతపురం జిల్లా నుంచే పోటీ చేస్తానని ఆయన అప్పట్లో ప్రకటించారు కూడా. దీంతో అందరూ పవన్ కదిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని భావించారు.రాష్ట్ర విభజన తర్వాత, జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో పవన్ కల్యాణ్ తన ఓటు హక్కును ఏలూరు నియోజకవర్గంలో నమోదు చేయించుకున్నారు. దీంతో అందరూ అప్పట్లో పవన్ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనుకున్నారు. ఇక జిల్లాల పర్యటనలో ఆయన తూర్పుగోదావరి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు కూడా తెలిపాయి. అక్కడ కాపు సామాజిక వర్గం గెలుపును డిసైడ్ చేస్తుండటంతో పిఠాపురాన్నే ఎంచుకుంటారని అనుకున్నారంతా.కానీ స్క్రీనింగ్ కమిటీకి ఇచ్చిన దరఖాస్తులో పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పోటీ చేయాలని అందులో పేర్కొన్నట్లు సమాచారం. తనకు ఉత్తరాంధ్ర జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి అవకాశమివ్వాలంటూ దరఖాస్తులో పేర్కొన్నట్లు తెలియడంతో శ్రీకాకుళం జిల్లా నుంచే పవన్ పోటీకి దిగుతారన్న ఊహాగానాలు విన్పిస్తున్నాయి. తాను ఒక స్థానం నుంచే బరిలోకి దిగాలని భావిస్తున్నట్లు దరఖాస్తులో పవన్ పేర్కొన్నారు. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం పవన్ చేసిన పోరాటం, వెనుకబడన ప్రాంతంలో తన పర్యటనకు వచ్చిన స్పందన చూసి పవన్ ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాను ఎంచుకున్నారని తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడి నుంచి అనేది మాత్రం ఇంకా సస్పెన్స్.