YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అభినందన్ ప్రొఫైల్ ఇదే

 అభినందన్ ప్రొఫైల్ ఇదే

యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:   

పాక్ భూభాగంపై భారత వాయుసేన దాడులకు ప్రతీకారంగా పాక్ వాయుసేన భారత ఆర్మీ పోస్టులపై దాడికి ప్రయత్నించింది. పాక్ యుద్ధ విమానాలను భారత దళాలు అడ్డుకున్నాయి. పాక్ భూభాగంలోనే వాటిని కూల్చివేసినట్లు ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో భారత్‌కు చెందిన మిగ్ 21 విమానం ఒకటి గల్లంతైనట్లు తెలిపారు. భారత పైలట్‌ను పాక్ సైన్యం తమ ఆధీనంలోకి తీసుకుందని వెల్లడించారు. ఐఏఎఫ్‌తో పాటు భారత విదేశాంగ శాఖ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. పాక్ ఆధీనంలో భారత పైలట్ చిక్కుకుపోయాడనే వార్తలు భారతీయులను కలవరపెడుతున్నాయి. ఆ పైలట్ క్షేమంగా తిరిగి రావాలని దేశ వాసులు ప్రార్థిస్తున్నారు. అతణ్ని క్షేమంగా తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పాక్ సైన్యం చేతికి చిక్కిన భారత పైలట్ పేరు అభినందన్ వర్ధమాన్ అని తెలుస్తోంది. పాక్ ఆధీనంలో మన పైలట్ ఉన్నాడని భారత విదేశాంగ శాఖ వెల్లడించినప్పటికీ ఆయన పేరు మాత్రం చెప్పలేదు. పాక్ మీడియా చూపిస్తున్న ఓ వీడియోలో భారత పైలట్ అభినందన్‌‌గా తెలిపారు. అభినందన్ స్వస్థలం తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా తిరుపనూరు. యుద్ధ విమానాలను నడపడంలో ఆయనకు విశేష అనుభవం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రత్యేక నైపుణ్యాలు సొంతం చేసుకున్న అభినందన్‌కు ఐఏఎఫ్ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఐఏఎఫ్‌కు చెందిన సూర్య కిరణ్ ఎయిర్‌క్రాఫ్ట్‌కు ఆయన వింగ్ కమాండర్‌గా పనిచేస్తున్నారు. అభినందన్ తండ్రి కూడా ఎయిర్‌ మార్షల్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. తమిళనాడులోని ఉడుమలైపేటలోని సైనిక్ స్కూల్‌లో అభినందన్ విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం అభినందన్ కుటుంబం చెన్నైలోని తాంబరంలో ఉన్న ఎయిర్‌ ఫోర్స్ అకాడమీలో నివసిస్తోంది. 

Related Posts