యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం రాత్రి 8.00 గంటలకు జరుగనున్న శ్రీవారి గరుడ సేవలో అలంకరించేందుకు ఉదయం శ్రీ గోవిందరాజస్వామి ఆలయం నుండి ఆండాళ్ అమ్మవారి మాలలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. గోదా కల్యాణయాత్ర పేరిట నిర్వహించే ఈ యాత్రలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యాత్ర శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7.00 గంటలకు ప్రారంభమైంది. ఆలయం నుండి ఎస్వీ గోసంరక్షణశాల, తాటితోపు, పెరుమాళ్లపల్లి మీదుగా అంబారీపై మాలల ఊరేగింపు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా అంబారీపై మాలలు ఆలయానికి చేరుకున్నది. అనంతరం అర్చకులు శాస్రోక్తంగా ఆండాళ్ అమ్మవారి మాలలను శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి మూలవిరాట్‌కు అలంకరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్దజీయంగార్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయంగార్ స్వామి, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవోలు వరలక్ష్మీ, ధనంజయులు, ఏఈవోలు ఉదయ్ భాస్కర్‌రెడ్డి, లక్ష్మయ్య, సూపరింటెండెంట్ చెంగల్రాయులు, ఇతర ఉన్నతాధికారులు, ఆధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.