యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు కారణంగా నిర్వాసితుల జీవితాలు నిలువునా మునిగిపోయాయి. మూడు దశాబ్దాలుగా సుమారు ఇరవై వేల కుటుంబాలు చెట్టుకొకరు, పుట్టకొకరు అన్నట్టుగా చెల్లాచెదురై ఈ ప్రాజెక్టు వల్ల బాధితులుగా రోడ్డున పడ్డాయి. ఈ ప్రాజెక్టు వల్ల మొత్తం 11 గ్రామాలకు చెందిన సుమారు 20 వేల కుటుంబాలు నిర్వాసితులుగా నేటికీ ఎటువంటి నష్టపరిహారం అందక, కోల్పోయిన భూమికి భూమి లేక అల్లాడుతున్నాయి. బాధిత కుటుంబాల ఆందోళనల నేపధ్యంలో నిర్వాసిత గ్రామాల్లో ప్రధానమైన రెండు గ్రామాలకు చెందిన 300 కుటుంబాలకు ఏలేశ్వరంలో ఇళ్ల స్ధలాలు కేటాయించారు. ప్రాజెక్టును ఏ లక్ష్యంతో నిర్మించారో ఆ లక్ష్యం నెరవేరలేదు. రాక్ ఇన్ డ్యామ్‌గా పద్ధతిలో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో మెకానిజం లేదు. ప్రాజెక్టు నీటిలభ్యతకు సంబంధించిన నీటి వనరులకు సంబంధించిన నిరంతరం అధ్యయనం లేదు. ఒడిసా రాష్ట్రం భూభాగం నుంచి విశాఖ సరిహద్దు మీదుగా వచ్చే జడేరు, మడేరు వాగుల నీరు బొంగరాలపాడు వద్ద కలిసి ఏలేరుగా రూపాంతరం చెంది అడ్డతీగల మండలం తిమ్మాపురం పంచాయతీ మీదుగా మర్రివీడు పంచాయతీ ముఖద్వారంలోకి చేరుతుందిఇక్కడ పునరావాస కాలనీ నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం నేటికీ తర్జనభర్జన పడుతున్నారంటే ముప్పై ఏళ్లకు గానీ పునరావాస కాలనీ లేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు.ఏలేరుకు భారీ వరదల కారణంగా జరుగుతున్న భారీ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని 1950-51లో సీడబ్ల్యూసీ వరద నివేదిక ప్రకారం వరద నివారణ ప్రాజెక్టుగా ఏలేరు రిజర్వాయరు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 1990 దశకంలో ప్రాజెక్టును పూర్తిచేసి నేదురుమిల్లి జనార్ధనరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జాతికి అంకితంచేశారు. వాస్తవానికి 1.10 లక్షల హెక్టార్ల ఆయకట్టుకు సాగునీరు అందించాలని ఈ ప్రాజెక్టును రూపొందించారు. రిజర్వాయర్ నుంచి ఎడమ కాల్వ తవ్వకం పూర్తిచేసి మార్గమధ్యలోని ఆయకట్టుకు నీరిచ్చుకుంటూ వెళ్తామని చెప్పి 150 కిలో మీటర్ల మేర కాల్వ తవ్వి విశాఖ స్టీల్ ప్లాంటుకు, విశాఖ నగరానికి దాహార్తిని తీర్చడానికి నీటిని తీసుకెళ్లారు.మర్రివీడు పంచాయతీలో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ప్రతీ ఏడాది వచ్చే వరదల వల్ల కుడి సహజ కాల్వ పూడకుపోవడం, ఆక్రమణలకు గురి కావడం వల్ల పిఠాపురం, సామర్లకోట, కిర్లంపూడి, గొల్లప్రోలు, తొండంగి, యు కొత్తపల్లి, కాకినాడ రూరల్ ప్రాంతాల్లో ఏలేరుకు వరదలు వచ్చాయంటే కోట్ల విలువైన పంటలు ముంపునకు గురవుతూనే వుంటాయి. దీనికి తోడు ఏలేరు వరద నీరు సముద్రంలోకి వెళ్ళే చోట బీచ్‌రోడ్డు వల్ల కూడా ఈ ప్రాంతాల్లో ముంపు పెరిగిపోతుందని తెలుస్తోంది. ఏలేరు రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంలో గోకవరం, ఏలేశ్వరం, అడ్డతీగల, గంగవరం మండలాల పరిధిలోని 7 పంచాయతీలకు చెందిన గ్రామాలవారు నిర్వాసితులయ్యారు. ఇందులో గోకవరం, ఏలేశ్వరం సబ్ ప్లాన్ గ్రామాలు కాగా అడ్డతీగల, గంగవరం మండలాల్లోని గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాగా ఉన్నాయి. మొత్తం సుమారు 20 వేల కుటుంబాల వారు నిర్వాసితులయ్యారు. గోకవరం మండలం కణుజువాడ, మొల్లేరు మల్లవరం, గంగవరం మండలం రాములదేవిపురం, అడ్డతీగల మండలం డి కృష్ణవరం, ఏలేశ్వరం మండలం లక్కవరం, కంబాలపాలెం, జె అన్నవరం, మర్రివీడు, రమణక్కపేట, శ్రీరాయవరం గ్రామాలు నిర్వాసిత గ్రామాలు. నిర్వాసితుల్లో అధిక శాతం ఆదివాసీలున్నారు. వీరిలో కొందరికి బంజరు భూములుంటే, మరికొంత మంది సీలింగ్ భూములు, మరికొంతమందికి డి పట్టా భూములున్నాయి.ప్రాజెక్టు నిర్మాణ దశలో నిర్వాసితులుగా వున్న కుటుంబాలు నేటికీ నిర్వాసితులుగానే అతీగతీ లేకుండా ఉన్నాయి. వీరిలో కొంత మంది మృతిచెందారు. రెండు, మూడు తరాలున్నాయి. ప్రధానంగా నిర్వాసితులైన లక్కవరం, మర్రివీడు గ్రామస్థులకు పునరావాస కాలనీ లేకపోవడంవల్ల ప్రాజెక్టు కొండల అంచుల్లో స్వయం నిర్మిత గ్రామాల్లో బతుకుతున్నారు. పునరావాసం చూపిస్తే ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకుంటామని చెప్తున్నా పట్టించుకున్న నాథుడు లేరు. ఏలేరు ఎఫ్‌ఆర్‌ఎల్ దాటి వరద నీరు వచ్చిందంటే ఈ గ్రామాలు నేటికీ ముంపునకు గురవుతూనే వుంటాయి. కొండపైకి ఎక్కి ప్రాణాలు దక్కించుకుంటారు. ప్రతీ ఏడాది వరదలకు గేదెలు, మేకలు, ఆవులు వంటి పశుసంపద అంతా కొట్టుకుపోతుంది. గత ఏడాది అయితే సుమారు వెయ్యికి పైగా పశువులు మృత్యువాతపడ్డాయి. ఈ రెండు గ్రామాల్లోని నిర్వాసితుల్లో ప్రధానమైన కొండదొరలు, కొండరెడ్లు దాదాపుగా సగానికిపైగా ఉంటారు. వీరందరికీ నేటికీ పునరావాస పునర్నిర్మాణ పధకం అమలుకాలేదు. ఎన్నో పోరాటల నేపథ్యంలో గంగవరం మండలం కణుజువాడలో 2001లో ఇటుకలతో ఇళ్లు నిర్మించారని, ఆ ఇళ్లన్నీ పక్కనే క్వారీ బ్లాస్టింగ్‌ల వల్ల కూలిపోయే పరిస్థితి రావడంతో నిర్వాసితులు ఇళ్ళను వదిలి రోడ్డుపై బతుకుతున్నారని ఏలేరు నిర్వాసితుల కోసం పోరాటం చేసిన సృజన సంస్థ సామాజికవేత్త కడలి రాజేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ ఆర్ శంకరన్ ద్వారా సృజన సంస్థ 2001-02లో అధ్యయన నివేదికను ప్రభుత్వానికి పంపించడం జరిగిందని, జీవో 68 ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేయాలని 2005-2006లో స్వర్గీయ బాలగోపాల్ డిమాండ్ చేశారని రాజేంద్ర చెప్పారు. ప్రాజెక్టు నిర్వాసితులకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధీనంలో రెండు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి న్యాయం చేయాలని రాజేంద్ర డిమాండ్ చేశారు. 1995 నుంచి 2005 వరకు నిర్వాసితుల గురించి సుజన సంస్థ ఏలేరు గోడు వినాలని సుదీర్ఘ పోరాటం సాగించింది. నిర్వాసితులకు ఐటిడి ఎ పీవోలుగా గతంలో పని చేసిన ముఖేష్‌కుమార్ మీనా, జయేష్ రంజన్‌లు గొర్రెలు, మేకలు పంపిణీ చేయడంతో వాటి ఆధారంగానే నేటికీ నిర్వాసితులు కొండ వాలులో వాటిని మేపుకుంటూ బతుకు బండిని లాగుతున్నారు. ఏదేమైనప్పటికీ ఏలేరు ప్రాజెక్టు నిర్మాణం వల్ల జీవవైవిధ్యం దెబ్బతినడమే కాకుండా నిర్వాసితుల జీవనానికి ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.