యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇండియా ఒక్కటిగా జీవిస్తుంది.. ఒక్కటిగా పోరాడుతుంది.. ఒక్కటిగా గెలుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు. సరిహద్దులో పాకిస్థాన్ చర్యల వల్ల అటు సైనికులకు గానీ, ఇటు దేశ ప్రజలకు గానీ ఆత్మస్థైర్యం ఏమాత్రం దెబ్బతినలేదన్నారు. గురువారం ఆయన ‘మేరా బూత్ సబ్‌సే మజ్‌బూత్’ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద వీడియో కాన్ఫరెన్స్‌గా బీజేపీ చెబుతోంది. భారత గగనతలంలోకి పాక్ యుద్ధ విమానాలతో తెగబడటం, పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మోదీ ప్రసంగం ప్రాధాన్యం సంతరించుకుంది. నమో యాప్ ద్వారా 15,000 ప్రాంతాల నుంచి కోటి మందికి పైగా కార్యకర్తలతో మోదీ ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ భావోద్వేగంగా మాట్లాడారు. ఉగ్ర దాడుల ద్వారా భారత్‌ను విడగొట్టడానికి పాక్ ప్రయత్నిస్తోందని మోదీ మండిపడ్డారు. ఇప్పుడు దేశ పౌరులందరూ సైనికుల్లా అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు. ‘పాక్ మనల్ని అస్థిర పరచడానికి చూస్తోంది. మన అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తోంది. కానీ, దేశమంతా ఇప్పుడు ఒక్కతాటిపైకి వచ్చి పాక్ దుష్ట ఆలోచనలను తిప్పి కొడుతోంది. ఇలాంటి సమయంలో భద్రతా బలగాల నైతిక స్థెర్యాన్ని దెబ్బ తీసేలా ఎవరూ వ్యవహరించకూడదు’ అని మోదీ అన్నారు. 2014 ఎన్నికల సమయంలో ప్రజల కనీస అవసరాలు తీర్చడం ఎజెండాగా ఉండేదని.. ప్రస్తుతం దేశవాసుల కలలను సాకారం చేయడం ఎజెండాగా మారిందని నరేంద్ర మోదీ చెప్పారు. అభివృద్ధిలో భారత్ మరో స్థాయికి చేరుకుందని ఆయన తెలిపారు. స్థిరమైన ప్రభుత్వం వల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.