యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కిల్లి కృపారాణి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో ఆమె గురువారం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో సమావేశం అయ్యారు. అనంతరం పార్టీలో చేరారు. కిల్లి కృపారాణికి వైసీపీ కండువా కప్పిన వైఎస్ జగన్.. సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. వైసీపీలో చేరిన అనంతరం కిల్లి కృపారాణి మీడియాతో మాట్లాడారు. జగన్ నిబద్ధత ఉన్న నాయకుడని కొనియాడారు. రాజకీయాల్లో రాటుదేలారని కితాబిచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు పట్టం కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో ప్రతి అంశంపై వైఎస్ జగన్ ఓ అజెండా సెట్ చేస్తే.. దానికి చంద్రబాబు రియాక్ట్ అవుతున్నారని కిల్లీ కృపారాణి అన్నారు. అజెండాను సెట్ చేసే వారే నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా నినాదం ఇంకా సజీవంగా ఉండటానికి కారణం వైఎస్ జగనేనని చెప్పారు. ‘వైఎస్సార్ సీపీ పోరాటాల వల్లే ఏపీకీ ప్రత్యేక హోదా అంశం నేటికీ సజీవంగా ఉంది. చంద్రబాబు గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు. ఆయనకు హోదాపై చిత్తశుద్ధి ఉంటే యూపీయేలో ఎందుకు చేరలేదు? నాలుగేళ్లు బీజేపీతో అంటకాగి ప్రత్యేక హోదాను తీసుకురాలేదు. హోదాను మోదీ కాళ్ల కింద తాకట్టు పెట్టారు’ అని కృపారాణి మండిపడ్డారు. చంద్రబాబు డబ్బుతో ఓటర్లను కొనాలనుకుంటున్నారు. ఎన్నికల ముందు పప్పూ బెల్లంలా ఏదో ఇస్తున్నారు. ప్రజలు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలి. ప్రజాస్వామ్య వ్యవస్థను చంద్రబాబు దెబ్బతీశారు. సంతలో పశువుల్లా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. నీచమైన రాజకీయాలకు చరమగీతం పాడాలి. చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’ అని కృపారాణి అన్నారు.