యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఓట్లు తొలగింపుపై ఒకేసారి లక్షల్లో అభ్యంతరాలు అంతర్జాలం ద్వారా ఎన్నికల అధికారులకు చేరాయి. దీంతో జిల్లా ఎన్నికల అధికారులు సైబర్‌క్రైం జరిగినట్టు గ్రహించి ఎన్నికల ప్రధాన అధికారి దృష్టికి తీసుకువెళ్లడంతో ఏపీ అంతటా ఓట్లు తొలగింపు అలజడి ఆరంభమైంది. 13 జిల్లాల్లో 5 లక్షల 20 వేల ఓట్లు ఫారం-7 ద్వారా డిలీషన్ కోసం 24 గంటల్లో అప్‌లోడ్ కావడం పట్ల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 32000 ఓట్లు ఒక్కరోజులో తొలగింపునకు ఫారం-7 అప్‌లోడ్ కావడం గమనార్హం. ఈ పేర్లు ఓటరు జాబితా నుండి తొలగించాలంటూ తమకు అభ్యంతర పత్రం వచ్చిందంటూ యంత్రాంగం.. మరోపక్క అభ్యంతరం వ్యక్తం చేసిన పత్రంలో సిఫార్సు చేసిన వారి పేర్లు కూడా స్థానికులదే కావడం.. ఇదే విషయమై అధికారులు విచారణతో గ్రామాల్లో ఓట్లు తొలగించే ఫారమ్-7 పెను అలజడినే సృష్టించింది. గడచిన కాలంగా గ్రామాల్లో నివాసం ఉంటున్న తమ పేర్లను ఓటు తొలగింపు జాబితాలో కనిపించే సరికి సంబంధిత ఓటర్లు అందోళన చెందుతుండగా.. ఆయా ఓట్లు తొలగించాలంటూ అభ్యంతరం జాబితాలో సిఫార్సు చేసిన పేరు ఉన్న వారిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వలస జీవనం.. వృత్తిరీత్యా వేరే ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారని.. వీరి పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించాలంటూ ఫారం-7లో అంతర్జాలం ద్వారా అభ్యంతరం వ్యక్తం చేయడం సాధారణం. అయితే గడచిన 90 రోజుల్లో కేవలం రెండు అంకెలుకే పరిమితమైన ఇటువంటి అభ్యంతరాలు జాబితా ఒకేరోజు వేలల్లో ఉండడంతో యంత్రాంగం ఒక్కసారి ఉలిక్కిపడింది. ఈ తంతు కేవలం నియోజకవర్గానికే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ అంతటా చోటుచేసుకుంది. రాష్ట్ర ఎన్నికలు కమీషన్ కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా పరిగణించింది. కమీషన్ డాష్‌బోర్డులో ఒకేసారి ఓట్లు తొలగించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసిన జాబితా నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలు వారీగా వందల సంఖ్యలో రావడంతో అధికారులు పొలింగ్ కేంద్రాలు వారీగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. నియోజకవర్గం వారీగా సగటున 4 వేలు వరకు ఇటువంటి అభ్యంతరాలు కేవలం రెండు రోజుల్లో రావడంతో అధికారులు, యంత్రాంగం అయోమయానికి గురయ్యారు. ఇప్పటికే ఎన్నికలు ప్రక్రియకు సంబంధించిన నివేదికలు సిద్ధం చేయడంలో తలమునకలై ఉన్న యంత్రాంగానికి ఫారం-7 సృష్టించిన అలజడి మరింత తలనొప్పిగా తయారుకాగా.. గ్రామాల్లో విభేదాలకు తెరలేపింది. ఫలానా ఓటరు స్థానికంగా ఉండడం లేదని, ఆ ఓటు తొలగించాలంటూ అంతర్జాలం ద్వారా ఎన్నికలు కమిషన్‌కు అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యక్తులు కూడా అదే గ్రామానికి చెందిన వారు కావడం విశేషమైతే.. వీరంతా ఒకే బంధువర్గానికి, రాజకీయ పార్టీకి చెందిన వారు కావడం మరో విశేషం.. ఫారం-7 సృష్టించిన అలజడి గ్రామాల్లో రాజకీయంగా పెను దుమారానే్న లేపింది. ముఖ్యంగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీకి పెను సవాల్‌గా మారింది. కేవలం రెండు రోజుల్లో వెల్లువెత్తిన అభ్యంతరాలపై ఎన్నికలు కమీషన్ సీరియస్‌గా పరిగణించి క్షేత్ర స్థాయిలో విచారణకై ఆదేశాలు జారీచేసింది. కేవలం అంతర్జాలం వేదికగా సాగిన ఈ ప్రక్రియను యంత్రాంగం సీరియస్‌గా తీసుకొని సైబర్ క్రైమ్‌గా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటు తొలగింపు అభ్యంతరాలుపై యంత్రాంగం మీ-సేవ..పోలింగ్ కేంద్రాలు వారీగా విచారణలు సాగిస్తున్నారు. అధికారులు విచారణలో తాము ఈ మధ్య కాలంలో ఫారం-7లు అప్‌లోడ్ చేయలేదని, మీ-సేవా కేంద్రాల నిర్వాహకులు, ఓటు తొలగించాలంటూ అభ్యర్ధించలేదని ఓటరు.. తాను ఎటువంటి కార్యకలాపాలు సాగించలేదని.. అదీ కూడా తమ బంధువర్గం, తన సానుభూతిపరులవి ఎందుకు తొలగిస్తానని.. తనపై ఎవరో గిట్టని వ్యక్తులు ఇటువంటి దుశ్ఛర్యకు పాల్పడ్డారని, అంతర్జాలంలోని ఫారం-7లో అభ్యంతరం వ్యక్తం చేసిన వ్యక్తిగా అభియోగం ఎదుర్కొంటున్న వారు అంటున్నారు. దీంతో అధికారులు ఉభయులు వద్ద వాంగ్మూలం తీసుకొంటూ నివేదికలు సిద్ధం చేస్తుండమే కాకుండా పోలీసులను ఆశ్రయించారు.ఫారం-7లో వస్తున్న తొలగింపులపై ప్రత్యేకంగా గురువారం రాత్రి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణద్వివేది జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాలో అధిక సంఖ్యలో ఫారం-7 అప్‌లోడ్ చేసే వారిని గుర్తించి ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేయాలంటూ ఆదేశించారు. అటువంటి వారిని వెంటనే గుర్తించి క్రిమినల్ చర్యలు చేపట్టాలన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తున్నవారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి తొలగింపులు చేయడం జరగదన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న క్ల్రైమ్‌లు త్వరితగతిన ఫారం-6 పెండింగ్‌లో ఉన్నాయి. వేగంగా పరిష్కరించడానికి అవసరం మేరకు సిబ్బందిని వినియోగించాలని 13 జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. సెలవు రోజులు అని చూడకుండా పరిష్కరించాలన్నారు.