పగలు మండే ఎండలు.. రాత్రి వణికించే చలి గాలులతో జిల్లా జనం బెంబేలెత్తి పోతున్నారు. వింతైన వాతావరణం కారణంగా జబ్బులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దగ్గుతో ఆరంభమై తీవ్ర జ్వరంగా మారుతోంది . పిల్లలు, వృద్ధులపై ఎక్కువ ప్రభావం కనిపిస్తోంది. మూడు రోజులుగా ఈ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఆస్పత్రులన్నీ జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. సహజంగా మార్చి మొదటి వారం నుంచి ఎండకాలం వ్యాధుల ప్రభావం కనిపిస్తుంది. ఈసారి పది రోజుల ముందే జబ్బులు ప్రబలాయి. సాధారణ జబ్బులను క్షేత్ర స్థాయిలోనే నయం చేయాల్సి ఉంది. కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులు నామమాత్రపు సేవలకే పరిమితం అవుతున్నారు. అందుకే దగ్గు, జలుబు వచ్చినా వ్యయ, ప్రయాసలకోర్చి ప్రభుత్వ సర్వజనాస్పత్రికి రావాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లాంతటా రోగులు ఇక్కడికి వస్తుండటంతో ఓపీలన్నీ రద్దీగా మారాయి. సర్వజనాస్పత్రి చిన్నపిల్లల వార్డులో మొన్నటిదాకా రోజూ సగటున 70 మందికి దాకా చికిత్స పొందారు. ప్రస్తుతం ఈ సంఖ్య 130కి చేరింది. ఇదే క్రమంలోనే ఓపీ రోగుల సంఖ్య ఏకంగా 1976గా నమోదైంది. ఇందులో పురుషులు 940 ఉంటే.. స్త్రీలు 1036 మంది ఉన్నారు. మొన్నటి దాకా ఓపీ రోజూ సగటున 1500 ఉండేది. జ్వర పీడితుల ఓపీలను చూస్తే... సర్వజనాస్పత్రి చిన్నపిల్లల ఓపీ 232, జనరల్ మెడిసిన్ ఓపీ 476 మంది ప్రకారం ఉన్నారు. దీన్నిబట్టి జ్వరాల తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వ్యాధుల కాలం మొదలు కాగానే క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. కానీ చాలా పీహెచ్‌సీల్లో ప్రాథమిక సేవలు కూడా అందడం లేదు. దీంతో రోగులు చిన్నపాటి రోగాలకు పెద్దాస్పత్రికి వస్తున్నారు. పలువురు వైద్యులు విధులకే వెళ్లడం లేదన్నది నిష్ఠూర సత్యం. కార్యక్రమ అధికారుల పర్యవేక్షణ కొరవడింది. సమీక్షల పేరుతో జిల్లా కేంద్రంలోనే కాలం గడిపేస్తున్నారు. ఫలితంగా క్షేత్ర స్థాయి సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిరక్షణపై కనీస శ్రద్ధ చూపడం లేదు. ప్రజలకు సైతం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలపై నమ్మకం కోల్పోతోంది. వైద్యులు, సూపర్‌వైజర్లు మెండుగా ఉన్నారు. ఖాళీలు పది శాతం కూడా లేరు. ఆరోగ్య కార్యకర్తల సిబ్బంది కొరత ఉంది. మూడేళ్లుగా జిల్లాను కాలానుగుణ వ్యాధులు పీడిస్తున్నాయి. పదుల సంఖ్యలో డెంగీ, మలేరియాతో మృత్యువాత పడ్డారు. వేలాది మంది బాధితులుగా మిగిలారు. ఈ సారి 21 పీహెచ్‌సీలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచామంటూ ఫిబ్రవరి మొదటి వారంలో ఇంటింటా తిరిగి చేతులు దులుపుకొన్నారు.వ్యాధుల కాలం మొదలవ్వడంతో అప్పుడే మందుల కొరత కూడా తెరపైకి వచ్చింది. సర్వజనాస్పత్రిలో సాధారణ పారాసిట్‌మాల్ టానిక్ కూడా లేదు. ఇక్కడ ఎంత దయనీయ దుస్థితి నెలకొందో అవగతం అవుతోంది. ఇదే తరహాలోనే హిందూపురం, ఉరవకొండ, కదిరి, గుంతకల్లు, ధర్మవరం, ముదిగుబ్బ వంటి ప్రాంతాల్లో మందుల కొరత నెలకొన్నట్లు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది. ఆయా శాఖ అధికారులు మాత్రం మందుల సమస్యపై ఏమాత్రం దృష్టి సారించలేదు. కోటా పూర్తయిందంటూ ఏపీఎంఎస్‌ఐడీ జిల్లా కేంద్ర ఔషధ గోదాము సిబ్బంది సైతం చేతులు ఎత్తేస్తున్నారు. మార్చి నెలలో తీవ్రమైన జ్వరాలు పెరిగే ప్రమాదం ఉంది. ఇప్పుడు మేలుకుని మందుల కొరత తీర్చకపోతే మరింత ప్రమాదం ఏర్పడనుంది. ఈ దిశగా అధికార యంత్రాంగం చర్యలకు ఉపక్రమించాల్సి ఉంది