YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

అయోమయంగా బుట్టా భవితవ్యం

అయోమయంగా బుట్టా భవితవ్యం
యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు జిల్లాలో ప్రస్తుత ఎంపీ బుట్టారేణుక పరిస్థితి అయోమయంగా తయారైంది. బుట్టా రేణుకకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారన్న ప్రచారం జరిగింది. అయితే నలుగురు ఎమ్మెల్సీలలో బుట్టా రేణుకకు చోటు దక్కలేదు. దీంతో ఆమెకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇక లేదని తేలిపోయింది. బుట్టా రేణుక గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి కర్నూలు ఎంపీగా నెగ్గారు. ఫలితాలు వచ్చిన వెంటనే బుట్టా రేణుక భర్త టీడీపీలోకి చేరిపోయారు. కొంతకాలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన బుట్టా రేణుక సీటు విషయంలో తేడా వచ్చి పార్టీ మారారు. వైసీపీ నుంచి టీడీపీలోకి చేరినా ఆమె ఆశ మాత్రం మరోసారి నెరవేటట్లు కన్పించడం లేదు.వైసీపీలో ఉన్నప్పుడు బుట్టా రేణుక తనకు ఎమ్మెల్యే టిక్కెట్ కావాలని కోరారు. అయితే జగన్ అందుకు అంగీకరించలేదని చెబుతారు. తిరిగి ఎంపీగానే పోటీ చేయాల్సి ఉంటుందని ఆమెకు స్పష్టం చేయడంతో బుట్టా రేణుక పార్టీని వీడారు. తెలుగుదేశం పార్టీలో చేరితే తనకు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోయినా ఖచ్చితంగా ఎంపీ టిక్కెట్ దక్కుతుందని భావించారు. అయితే బుట్టా రేణుక అనుకున్నదానికి పూర్తి విరుద్ధంగా రాజకీయ సమీకరణాలు మారాయి. ఇప్పుడు ఎంపీ టిక్కెట్ టీడీపీ బుట్టా రేణుకకు ఇచ్చేందుకు సిద్ధంగా లేదు.కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి త్వరలోనే టీడీపీలో చేరుతుండటంతో కర్నూలు లోక్ సభ స్థానం ఆయనకే గ్యారంటీ అన్నది అందరికీ తెలిసిందే. కోట్ల ఫ్యామిలీ చేరికతో పార్టీ బలం పెరుగుతుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. బుట్టాను పక్కన పెట్టయినా కోట్ల ఫ్యామిలీకి ప్రయారిటీ ఇవ్వడం ఖాయం. దీంతో బుట్టాకు ఎంపీ టిక్కెట్ దక్కకపోవడంతో ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి బలంగాఉన్నారు. ఎమ్మిగనూరు అయితే తన సామాజిక వర్గం అండగా ఉండి గెలుపు ఈజీ అని భావించినా ఆ సీటు కూడా దక్కే అవకాశం బుట్టాకు లేదన్నది దాదాపుగా తేలిపోయింది. ఇటీవల బుట్టా రేణుకను పాణ్యం నియోజకవర్గానికి పంపుతారన్న ప్రచారం కూడా జరిగింది. పాణ్యంలో టీడీపీకి సరైన అభ్యర్థి లేకపోవడంతో బుట్టాను అక్కడకు పంపుతారనుకున్నారు. కానీ గౌరు కుటుంబం కూడా వైసీపీని వీడి టీడీపీలో చేరతారన్న టాక్ బలంగా విన్పిస్తోంది. గౌరు కుటుంబం టీడీపీలోకి వస్తే పాణ్యం టిక్కెట్ కూడా ఆ కుటుంబానికే దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో పాణ్యంపై కూడా ఆశలు లేనట్లే. ఇదే జిల్లాలోని ఆదోని నియోజకవర్గాన్ని బుట్టాకు ఇస్తారన్న ప్రచారం ఉంది. అయితే ఇక్కడ పార్టీకి వీర విధేయుడిగా ఉన్న మీనాక్షినాయుడు ఉన్నారు. ఈ జిల్లాలో ఒకే ఒక కమ్మ సామాజిక వర్గం నేత ఆయన కావడంతో ఆయనను తప్పిస్తారా? అన్న అనుమానాలూ ఉన్నాయి.  తాజాగా భర్తీ చేసిన ఎమ్మెల్సీ కూడా దక్కకపోవడంతో బుట్టా రేణుక భవితవ్యం ఏంటన్నది ప్రశ్నగా మారింది. మరి చంద్రబాబు బుట్టాను ఎక్కడ కూర్చోబెడతారన్నది తెలియాల్సి ఉంది.

Related Posts