YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మోడీ..మిరాజ్ 2

మోడీ..మిరాజ్ 2
యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
సర్జికల్ స్ట్రయిక్ -2 భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. పాకిస్థాన్ పై భారత్ కసి తీర్చుకున్న వైనంపై యావత్ భారతదేశంలో సంబరాలు మిన్నంటాయి. మోదీకి అండగా ఉంటామని పార్టీల కతీతంగా ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. నిజానికి పుల్వామా దాడి తర్వాతనే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందన్న చర్చ దేశవ్యాప్తంగా మొదలయింది. కానీ కేవలం పన్నెండు రోజుల్లోనే దెబ్బకు దెబ్బ తీయడంతో మోదీకి ఇక తిరుగులేదన్న వ్యాఖ్యలు సర్వత్రా విన్పిస్తున్నాయి.నిజానికి మోదీ ఈ ఐదేళ్ల కాలంలో చేసిందేమీ లేదన్న పెదవి విరుపులు నిన్నటి దాకా విన్పించేవి. ఒక్కసారిగా సర్జికల్ స్ట్రయిక్స్ తో సీన్ మారిపోయింది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో భారతీయ జనతా పార్టీ ఓటమి పాలయింది. దీన్ని బట్టి వచ్చే లోక్ సభ ఎన్నికలలో సయితం బీజేపీకి ఓటమి తప్పదని, మ్యాజిక్ ఫిగర్ కు కూడా చేరుకోలేదన్న కామెంట్స్ బలంగా విన్పించాయి. దీనికి తోడు సర్వేలు కూడా విపక్ష కూటమి వైపే మొగ్గు చూపాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదంటున్నారు.మధ్యప్రదేశ్, రాజస్థాన్,గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత ప్రజల మనోగతంలో మార్పు వచ్చిందంటున్నారు. పాక్ కు బుద్ధి చెప్పాలంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి తీరాల్సిందేనన్న అభిప్రాయం కలుగుతుంది. ముఖ్యంగా యువత ఎక్కువగా బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నట్లు పార్టీ కూడా గుర్తించింది. పాక్ ను మట్టు బెట్టాల్సిందేనంటూ వారు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టింగ్ లు బీజేపీకి పాజిటివ్ గా మారే సూచనలు కన్పిస్తున్నాయి. నిజానికి ఉత్తరప్రదేశ్ లో జరిగిన ప్రతి ఉప ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలయింది. దీన్నుంచి బయటపడేందుకు అయోధ్య అంశాన్ని తెరపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో ఓట్ల పంట పండించుకుందామనుకున్నారు.కానీ ఆ అవసరం ఇప్పడు లేదంటున్నారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు. పాక్ కు బుద్ధి చెప్పే సత్తా ఒక్క మోదీకే ఉందన్న అభిప్రాయం ప్రజల్లో కలిగిందని వారు బాహాటంగానే చెబుతున్నారు. ఉత్తరాది రాష్టాల్లో దెబ్బతింటామేనన్న భయంతో నిన్న మొన్నటి వరకూ ఉన్న బీజేపీ నేతలు ఇప్పుడు తమ గెలుపును సర్జికల్ స్ట్రయిక్స్ సెట్ చేస్తాయని ధీమాగా ఉన్నారు. ఐదేళ్ల కాలంలో అవినీతి ఆరోపణలు లేకపోవడం కూడా మోదీ పార్టీకి ప్లస్ పాయింట్ అని, విపక్షాలు సయితం కూటమి ఏర్పాటు లో విఫలం కావడం, నాయకత్వ సమస్యతో అల్లాడి పోతుండటం తమకు కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తం మీద సర్జికల్ స్ట్రయిక్స్ తర్వాత కమలనాధుల్లో జోష్ పెరిగింది. మిరాజ్ యుద్ధ విమానం లాగానే మోదీ గ్రాఫ్ పెరిగిందంటున్నారు.

Related Posts