యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఈసారి ఒంటరిగా బరిలోకి దిగుతోంది. అనేక సమీకరణలు చూసుకుంటూ పొత్తుల ఎత్తులు వేయడంలో దిట్టగా ముద్రపడ్డారు టీడీపీ అధినేత. ఈసారి రాజకీయ అనివార్యత టీడీపీని ఏకాకిని చేసింది. గతంలో మూడుసార్లు బీజేపీతో కలిసి నడిచిన చంద్రబాబు నాయుడు. తెలంగాణలో కాంగ్రెసుతోనూ ప్రయోగం చేశారు. 2009లో వామపక్షాలు, టీఆర్ఎస్ తోనూ కలిసి నడిచారు. గాలివాటం కనిపెట్టి వ్యూహరచన చేయడం, అందుకనుగుణంగా రాజకీయ పొత్తులు కలపడం చంద్రబాబు నాయుడి వ్యూహరచనలో అంతర్భాగం. నవ్యాంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం టీడీపీతో చేయి కలిపి ఎన్నికల్లో పాల్గొనేందుకు ఏ ఒక్క పార్టీ సిద్ధంగా లేదు. హస్తం పార్టీ తయారుగా ఉన్నప్పటికీ దానివల్ల కలిసొచ్చే ప్రయోజనం శూన్యమనేది టీడీపీ భావన. ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఒంటరి పోరాటం ఎంతమేరకు కలిసివస్తుందనే అంతర్మథనం పార్టీలో మొదలైంది. యాంటీ మోడీ, యాంటీ కేసీఆర్ సెంటిమెంటు కలిసి వస్తుందని వేసుకున్న అంచనాలూ తలకిందులవుతాయన్న అనుమానాలతో ఆందోళనకరమైన పరిస్థితి నెలకొంటోంది. ఎత్తుగడల్లో మార్పులు చేసుకుంటూ కొత్త పంథాను ఎంచుకోవాలని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. వరసగా నాలుగు ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో , కూటమితో కలిసి టీడీపీ ఎన్నికల ఘట్టాన్ని ఎదుర్కొంది. ఇరవయ్యేళ్ల తర్వాత తెలుగుదేశం ఎన్నికల క్షేత్రంలో ఎవరి తోడూ లేకుండా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీకి ఇది పరీక్షా కాలం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కొత్త రాష్ట్రంలో పట్టం గట్టిన పార్టీ తాను మరోసారి వారి విశ్వాసాన్ని పొందగలిగితే అదో రికార్డు అవుతుంది. మళ్లీ గెలిస్తే ఈ కాలంలో వచ్చిన అవినీతి ఆరోపణలు, వారసుడు లోకేశ్ పై వచ్చిన విమర్శలు వంటివన్నీ ప్రజలు పట్టించుకోలేదని నిరూపితమవుతుంది. భవిష్యత్తులో కొత్తతరం నాయకత్వానికి స్థిరమైన పునాదులు పడతాయి. ఒకవేళ ఓటమి ఎదురైతే చంద్రబాబుకు ఎదురీత తప్పదు. మళ్లీ కష్టాలు ఎదుర్కోవాలి. లోకేశ్ నాయకత్వం స్థిరపడేందుకు మరింత సమయం పడుతుంది. పార్టీపరంగా, ప్రభుత్వ పరంగా ఆయన పగ్గాలు అందుకునేందుకు ఎంతకాలం వేచిచూడాలో తెలియని స్థితి నెలకొంటుంది. జనాకర్షణ కలిగిన జూనియర్ ఎన్టీయార్ వంటివారిని పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్లు పెరుగుతాయి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలంటే గెలుపు తప్పనిసరి. జనాకర్షణలో లోకేశ్ కంటే జగన్ కే ఆదరణ ఎక్కువ . దానికీ పార్టీ గెలుపోటములకు సంబంధం లేదని టీడీపీ నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రజాబలం ఉందని పార్టీ నిరూపించుకుంటేనే కొత్త నాయకత్వానికి బాటలు పడతాయి.తెలుగుదేశం పార్టీ ఈ దపా అనుసరించబోతున్న స్ట్రాటజీ పక్కా అవకాశవాదమని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో అన్నిపార్టీలు కలిసి మోడీని ఓడించాలని చంద్రబాబు చెబుతున్నారు. అందుకుగాను ఎస్పీ,బీఎస్పీ కూటమికి పదే పదే విజ్ణప్తులు చేస్తున్నారు. కాంగ్రెసును కలుపుకుని పోవాలని రాజకీయంగా అఖిలేశ్, మాయావతిలపై ఒత్తిడి చేస్తున్నారు. అదే కాంగ్రెసు పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గిట్టని పార్టీ అయిపోయింది. తాను మాత్రం కాంగ్రెసుతో కలిసిపోటీ చేయడానికి ముందుకు రావడం లేదు. సీట్లు దండగని అంచనా వేసుకుంటున్నారు. తెలంగాణలో కాంగ్రెసుతో కలిసి వెళ్లి చేతులు కాల్చుకున్నారు. ఏపీలో కాంగ్రెసు విడిగా పోటీలో ఉంటే ఎంతోకొంత వైసీపీ ఓటు బ్యాంకుకు గండిపడుతుందని చంద్రబాబునాయుడి యోచన. దాంతో హస్తం పార్టీతో జాతీయ స్థాయిలో కలుస్తామని చెబుతూనే ఏపీలో మాత్రం దూరం పెడుతున్నారు. రాహుల్ నాయకత్వానికి , కాంగ్రెసు పార్టీకి మద్దతు కూడగట్టేందుకు స్వయంగా రంగంలోకి దిగి దేశవ్యాప్తంగా వివిధ పార్టీలతో సంప్రతింపులు జరుపుతున్నారు. కానీ సొంత రాష్ట్రంలో కాదు పొమ్మంటున్నారు. ఈ ద్వంద్వ విధానాన్ని పార్టీ వర్గాలు సరిగానే అర్థం చేసుకుంటున్నాయి. కానీ ప్రజల్లోకి చెడు సంకేతాలు వెళతాయేమోననే అనుమానాలైతే ఉన్నాయి.బీజేపీ, కేసీఆర్, జగన్ కలిసి ఆంధ్రాప్రయోజనాలను దెబ్బతీసేందుకు కుట్ర చేస్తున్నారంటూ తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రాజకీయ ప్రచారాన్ని మొదలు పెట్టింది. మోడీ వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. కానీ తాజా పరిణామాలు, పాకిస్తాన్ పై దాడుల నేపథ్యంలో మోడీ పట్ల ప్రజల్లో సానుకూల ద్రుక్పథం ఏర్పడితే మళ్లీ కథ మొదటికే వస్తుంది. టీడీపీ ఇంతకాలం చేసిన ప్రయత్నం వ్రుథా అవుతుంది. ఎన్డీఏ కూటమి నుంచి బయటికి వచ్చిన కారణం కూడా నిష్ఫలంగా మిగిలిపోతుంది. మరోవైపు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లకూడదనే ఉద్దేశంతో వైసీపీ, టీఆర్ఎస్ లు కూడా జాగ్రత్త పడుతున్నాయి. ఈ వారంలో జగన్ తో కేసీఆర్ భేటీ కావాల్సి ఉంది. దానిని వాయిదా వేసుకున్నారు. రాజధానిలో జగన్ గృహ ప్రవేశానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని విరమించుకున్నారు. బహిరంగంగా వైసీపీకి మద్దతు ప్రకటించడం నష్టదాయకమని కేసీఆర్ తమ పార్టీ నేతలకు కూడా సూచించినట్లు సమాచారం. తలసాని శ్రీనివాసయాదవ్ వంటివారిని ప్రయోగించి సామాజిక పరమైన అంశాల్లో వైసీపీకి లభిస్తున్న మద్దతును అంచనా వేయించే ప్రయత్నం చేశారు. యాంటీ సెంటిమెంటుకు దారి తీయకుండా జాగ్రత్త పడాలనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ప్రయోగాలకు స్వస్తి చెప్పి వ్యూహాత్మక సహకారంవైపు టీఆర్ఎస్ మొగ్గు చూపుతోంది. కేసీఆర్, కేటీఆర్ లు ఏపీలో పర్యటిస్తే టీడీపీకి లాభం చేకూరుతుందని ఆశించిన చంద్రబాబు కు ఆ విధంగానూ ప్రయోజనం సమకూరే సూచనలు కనిపించడం లేదు. ఇవన్నీ తెలుగుదేశం ఎన్నికల వ్యూహంలో మరిన్ని మార్పులు చేసుకోవాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి.