యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
నిజానికి ఆయన సున్నిత మనస్కుడే. పార్టీకి వీర విధేయుడే. లోక్ సభ ఎన్నికల ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు మాత్రం సొంత పార్టీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి, ప్రస్తుతం సంకీర్ణ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పరమేశ్వర్ ఎందుకు అసంతృప్తితో ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చెక్ పెట్టడానికేనా? లేక నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గానికి అన్యాయం జరుగుతుందా? లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఒక ప్రధాన పదవిలో ఉన్న పరమేశ్వర్ వ్యాఖ్యల వెనక లోగుట్టు ఏంటన్న దానిపై కాంగ్రెస్ అగ్ర నేతలు విశ్లేషించుకుంటున్నారు.వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పరమేశ్వర్ కు పెద్దగా పడదనే చెప్పాలి. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరమేశ్వర్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా ఆయనకు తగిన ప్రాధాన్యత సిద్ధరామయ్య ఇవ్వలేదన్నది పార్టీ వర్గాల టాక్. కొంతకాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు అధిక స్థానాలు వచ్చినా తక్కువ స్థానాలు దక్కిన జేడీఎస్ కు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సి వచ్చింది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ అధిష్టానం కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసి, పరమేశ్వర్ ను ఉప ముఖ్యమంత్రిగా చేసింది.కానీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయి దాదాపు తొమ్మిది నెలలు గడుస్తోంది. పాలనపై సిద్ధరామయ్య ప్రభావం ఎక్కువగా ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం జనతాదళ్ ఎస్, కాంగ్రెస్ ల సమన్వయ కమిటీ ఛైర్మన్ గా నియమించింది. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సిద్ధరామయ్య అనుమతి ఉండాల్సిందే. ఒకానొక దశలో ముఖ్యమంత్రి కుమారస్వామి సయితం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. పాలన తన చేతుల్లో లేదని ఆయన ఒకానొక సందర్భంలో చేతులెత్తేశారు కూడా. అంటే పరోక్షంగా కుమారస్వామి కూడా సిద్ధరామయ్యను వెలెత్తిచూపారన్న సంగతి అందరికీ తెలిసిందే. పరమేశ్వర్ వ్యాఖ్యలు కూడా సిద్ధరామయ్యను ఉద్దేశించినవేనంటున్నారు. దళితులకు అన్యాయం జరుగుతుందని, గతంలో తనకు మూడుసార్లు ముఖ్యమంత్రి పదవి రాకపోవడానికి కారణాలు కూడా తాను దళితుడను కావడమేనని అన్నారు. అంతేకాదు కొంత మంది తనను రాజకీయంగా అణిచివేయాలని చూస్తున్నారన్నారు. ఇదంతా లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే చేశారంటున్నారు. లోక్ సభ ఎన్నికల బాధ్యతను కూడా కాంగ్రెస్ అధిష్టానం సిద్ధారామయ్య కే అప్పగించడాన్ని కూడా కుమారస్వామి సయితం జీర్ణించుకోలేకపోతున్నారు. కుమారస్వామి, పరమేశ్వర్ ఇటీవల కాలంలో మంచి మిత్రలుగా మారడంతో సిద్ధూను దెబ్బకొట్టేందుకే ఇలా పరమేశ్వర్ వ్యాఖ్యలు చేశారన్న టాక్ పార్టీలో విన్పిస్తుంది. ఎన్నికల వేళ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఇలా వ్యాఖ్యానించడంపై కాంగ్రెస్ అధిష్టానంకూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.