యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
మోదీ పర్యటనకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లచొక్కాలతో నిరసన తెలపాలి. నేనుకూడా నల్లచొక్కా ధరిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం పలువురు టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నరేంద్రమోదీ విశాఖ పర్యటన సందర్భంగా నిర్వహించే ధర్మపోరాట నిరసనలతో రాష్ట్రం హోరెత్తాలని టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నల్ల బెలూన్లు, నల్లజెండాలతో నిరసన తెలపాలన్నారు. నరేంద్ర మోదీ విశాఖ రాకను అందరూ నిరసించాలని, మనకు తీరని అన్యాయం చేశారు.., ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు.., గాయాలను కెలికేందుకే మోదీ విశాఖ వస్తున్నారు.., మన గాయాలపై కారం జల్లడానికే మోదీ వస్తున్నారని చంద్రబాబు అన్నారు. మోదీ తిరిగి వెళ్లేదాకా నిరసనల జోరుతో హోరెత్తాలని, బహిరంగ లేఖలో మోదీ చేసిన ద్రోహాన్ని నిలదీశానని, ఐదేళ్లలో మోదీ చేసిన అన్యాయాన్ని నిగ్గదీశానన్నారు. విశాఖ రైల్వే జోన్ మోదీ మోసపూరిత నిర్ణయమని, ఆదాయం లేని జోన్ బీజేపీ కుట్రపూరిత నిర్ణయమన్నారు. దీనిని అందరూ ఖండించాలని, మోదీ నమ్మకద్రోహాన్ని నిలదీయాలన్నారు. అలాగే మన ఆదాయాన్ని కూడా ఒడిశాకు ఇచ్చారని, జోన్ అడిగితే డివిజన్ కూడా తీసేశారని, రాబడి లేని మాయా జోన్ను మనకు ఇచ్చారని చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే 12 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష పూర్తి చేసాం. అన్ని ఎంపి సీట్లు,అసెంబ్లీ సీట్లలో పూర్తి సానుకూలత ఉంది. ఇంకా 13 పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేయాలి. ఈ ఎన్నికలు టిడిపికే కాదు రాష్ట్రానికే కీలకమని అయన అన్నారు. ఐదేళ్లలో మోది చేసిన అన్యాయాన్ని నిగ్గదీశానని చంద్రబాబు అన్నారు.