యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీ కీలక నేత చలమలశెట్టి సునీల్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ చేరారు. సునీల్‌కు పసుపు కండువా కప్పి చంద్రబాబు టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించారు. సునీల్‌తో పాటూ పెద్దాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ మాజీ కో-ఆర్డినేటర్లు తోట సుబ్బారావునాయుడు, ముత్యాల శ్రీనివాస్, కాకినాడ కార్పొరేషన్ కార్పొరేటర్లు కంపర రమేష్, పలకా సూర్యకుమారి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు సునీల్. తూర్పుగోదావరి జిల్లాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు. చంద్రబాబు నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని.. ఆయన మరోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా స్వీకరించేందుకు సిద్ధమన్నారు సునీల్. మరోవైపు సునీల్ వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున కాకినాడ లోక్‌సభ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఆయను టికెట్ దాదాపుగా ఖాయమయ్యిందనే ప్రచారం కూడా జరుగుతోంది. కాకినాడ నుంచి ఎంపీగా పోటీచేసిన తోట నర్సింహం.. ఈసారి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటాననడంతో సునీల్ వైపు చంద్రబాబు మొగ్గు చూపారట. చలమలశెట్టి సునీల్ తూర్పుగోదావరి జిల్లా వైసీపీలో కీలక నేతగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కాకినాడ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే కొద్దిరోజులగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వైసీపీ నాయకత్వ వైఖరి తనకు నచ్చట్లేదని.. తమ మనోభావాలను ఆ పార్టీ దెబ్బతీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలకు దూరంగా ఉండాలని భావించానని.. కానీ చంద్రబాబు తనను పిలిచి తనలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని చెప్పడంతో టీడీపీవైపు మొగ్గు చూపినట్లు సునీల్ చెప్పారు.