యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
జిల్లాలో మిర్చి రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలే గిట్టుబాటు ధర లేక నష్టపోతున్నామని, సాగర్ జలాలను ఇంకో తడికి ఇస్తే కొంత వరకైనా దిగుబడులను సాధించి గట్టెక్కుతామంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో 80 వేల హెక్టార్లలో పంట సాగు చేయగా ఊహించని రీతిలో బొబ్బర తెగులు ఆశించి వారి ఆశలపై నీళ్లు చల్లింది. తెగులువల్ల చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎకరాకు క్వింటానే పండగా పెదకూరపాడు, అచ్చంపేట, క్రోసూరు, సత్తెనపలి,్ల తాడికొండ, నరసరావుపేట ప్రాంతాల్లో పంట దారుణంగా దెబ్బతింది. దాంతో రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టిన వారు ఆర్థికంగా కోలుకోలేని స్థితికి చేరారు. ఇప్పటి వరకూ ఎక్కువ ప్రాంతాల్లో తొలి కోత మాత్రమే కోశారు. తక్కువగా అక్కడక్కడా రెండో కోత పూర్తి చేశారు. ఇక ఇప్పుడుగానీ నీళ్లు ఇవ్వకపోతే పంట మొత్తం చేతులారా ఎండబెట్టినట్లేనని ఆందోళన చెందుతున్నారు.
సాగర్ కుడికాలువ నుంచి నీటి సరఫరా నిలిచిపోయి పదిహేను రోజులుకాగా మిర్చి సాగుకు మరో తడి కావాలని రైతులు గట్టిగా కోరుతున్నారు. పంట వేసిన తొలినాళ్లలో సాగర్ జలాశయం నిండి ఉండడంతో ఈ ఏడాది సాగుకు ఢోకా ఉండదని సంబరపడ్డారు. ప్రభుత్వం కూడా నీటిని విడుదల చేసింది. మాగాణి, మెట్ట కలిపి 6.5 లక్షల ఎకరాల్లో సాగుకాగా వరి రైతులు మంచి దిగుబడులతోనే ఒడ్డున పడ్డారు. ఇక మిగిలినదల్లా మిర్చి పంట మాత్రమే. గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కలిపి 103 టీఎంసీల వినియోగం జరుగగా మరో తడికి నీళ్లు కావాలంటే ఎంతలేదన్నా 6-7 టీఎంసీలు అవసరమవుతాయని అంచనా. మొదటి కోత కోసిన వారికి ఇంకా రెండు కోతల వరకూ దిగుబడులు వచ్చే అవకాశం ఉండగా చివరకు వచ్చే సరికి నీళ్లు లేక పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
మహాశివరాత్రి కోటప్పకొండ తిరునాళ్ల నేపథ్యంలో చిలకలూరిపేట మేజరు కాల్వకు నీటిని సరఫరా చేసేందుకు బుగ్గవాగులో 0.75 టీఎంసీలను అధికారులు నిల్వ చేశారు. ఇక అంతకు మించి నీరు లేదని స్పష్టంగా చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం జోక్యం చేసుకుంటేనే తాము ఒడ్డున పడతామని రైతన్నలు అంటున్నారు. కల్లాల్లో పని చేయాలంటే కూలీలు దొరకని పరిస్థితినీ ఎదుర్కొంటున్నామని వాపోతున్నారు. తేజా రకాన్ని కోయాలంటే పరిస్థితిని బట్టి ఒక్కో కూలీ రోజుకు రూ.250 డిమాండు చేస్తున్నాడు. అవి కాకుండా రానుపోనూ ఆటో ఛార్జీలను రైతులే చెల్లించాలి. దీంతో ఖర్చులు తడిచి మోపెడవుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. వీటిని ఏదోలా భరిస్తాం, ముందు పంటకు నీళ్లు ఇప్పించాలని వేడుకుంటున్నారు.
Related Posts