యువ్ న్యూస్ జనరల్ బ్యూరో:
ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. రోజురోజుకు ఇసుక అక్రమ రవాణా పెరిగిపోతోంది. క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ఇష్టారాజ్యంగా తవ్వుకుపోతున్నారు. అక్రమ తరలింపుపై కఠిన చర్యలు లేకపోవడంతో దోపిడీదారులు తెగించి దర్జాగా జేబులు నింపేసుకుంటున్నారు. స్థానికంగా కొందరు నేతల అండదండలు, మరికొందరు అధికారుల కాసుల కక్కుర్తి వెరసి ఇసుకాసురులకు వరంగా మారింది. వంశధార నది నుంచి అక్రమంగా ఇసుకను తవ్వుతూ నదీ గర్భాన్ని సైతం తొలిచేస్తున్నా అధికారుల్లో మాత్రం చలనం లేకుండా పోయింది. నిబంధనలకు తూట్లు పొడుస్తూ అడ్డగోలుగా ఇసుకను తవ్వుకుపోతున్నా పట్టించుకోవాల్సి వారు మాత్రం చోద్యం చూస్తున్నారు. నదికి రెండు వైపులా ఇసుకను తవ్వేస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది.
శ్రీకాకుళం మండలంలో ఇసుక తవ్వకాలకు ఎలాంటి అనుమతి లేకపోయినా కొందరు అధికారుల అండదండతో యథేచ్ఛగా రవాణా జరుగుతున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. వంశధార, నాగావళి నదీతీర ప్రాంతాల్లో రాత్రిళ్లు ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అధికారుల చర్యలు మాత్రం శూన్యమే. అడపా దడపా కేసులు నమోదు చేస్తున్నారు. రెవెన్యూ, గనుల శాఖ, పోలీసుల కనుసన్నల్లోనే ఇసుక దందా జరుగుతోందనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ స్థాయిలోని వారు, తహసీల్దార్ కార్యాలయంలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న కొందరు వీరికి అండగా నిలిచి రవాణాకు సహకరిస్తున్నారని సమాచారం. ఉన్నతాధికారులు సైతం పట్టించుకోకపోవటంతో ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరుకాయలు అన్న చందంగా నడుస్తోంది. వంశధార నది పరిధిలో బట్టేరు, పొన్నాం, కరజాడ, భైరి తదితర ప్రాంతాల నుంచి, నాగావళి నది పరిధిలో కిల్లిపాలెం, కళ్లేపల్లిల్లో రాత్రి పది గంటల నుంచి అక్రమ రవాణా కొనసాగుతోంది.
మండలంలో నైర కేంద్రంగా పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరుగుతోంది. ఇసుక అక్రమ రవాణా చేస్తున్నది ఎవరు అనేది అధికారుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు లేవనే విమర్శలొస్తున్నాయి. నైర గ్రామంలో పంట పొలాల్లోనే ఇసుక గుట్టలు, గుట్టలుగా వేసి అక్కడ నుంచి రవాణాకు సిద్ధం చేస్తున్నారు. భారీగా ఇసుక నిల్వలను ఉంచారు. నదిలోని ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తరలించి రాత్రి వేళలో లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు.
ఇసుక అక్రమ తరలింపుతో దుమ్ము ధూళి రేగి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. యథేఛ్చగా నది నుంచి ఇసుకను తీసుకు వెళ్లటంతో ధూళి విపరీతంగా ఎగిరి శ్వాసకోస సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. పొన్నాం-బట్టేరు రహదారిపై వాహనచోదకులు ప్రయాణించాలంటే అప్రమత్తంగా ఉండాల్సిందే.... ఈ రహదారి పూర్తిగా ఇసుకతోనే నిండి పోయింది. వాహనచోదలకు ఆదమరచి వేగాన్ని పెంచితే ప్రమాదంలో పడినట్టే. ఇప్పటికే ఈ రహదారిలో పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా అధికారులు ఈ అక్రమ దందాపై కన్నెత్తి చూడడంలేదనే ఆరోపణలు ఉన్నాయి.