YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

తెలంగాణ

ఇక అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ  కొరడా 

Highlights

  •  కొలికొచ్చిన ఎల్‌ఆర్‌ఎస్‌ సమస్య 
  • ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసేలా.. 
  • మార్చిలో ప్రత్యేక డ్రైవ్‌
ఇక అక్రమ నిర్మాణాలపై హెచ్‌ఎండీఏ  కొరడా 


స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ కొలిక్కి రావడంతో.. ఇక అక్రమ నిర్మాణాలు... అనధికార లేఅవుట్లపై చర్యలకు హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) సన్నద్ధమవుతోంది.స్థలాల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ కొలిక్కి రావడంతో చర్యలకు సిద్ధమవుతోంది. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం.. ప్రజల భాగస్వామ్యంతో రంగంలోకి దిగనుంది. నిరంతరం కూల్చివేతల ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఆన్‌లైన్లో ఫిర్యాదు చేసేలా.. 
అక్రమ నిర్మాణాలు.. అనధికార లేఅవుట్లను పట్టించుకోవడం లేదంటూ హెచ్‌ఎండీఏపై  విమర్శల నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించి.. ఈ అంశంలో ఎలా ముందుకెళ్తే బాగుంటుందో కసరత్తు చేశారు. ఉద్యోగుల్లో పారదర్శకత.. జవాబుదారీతనాన్ని పెంచేలా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఎవరైనా నేరుగా ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేసేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తెచ్చారు. ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కొన్ని నెలలుగా హెచ్‌ఎండీఏ యంత్రాంగమంతా ఎల్‌ఆర్‌ఎస్‌పైనే దృష్టి సారించింది. ఈ నెల 28లోపు ఈ ప్రక్రియ పూర్తి కానుంది. ఆ తర్వాత ‘అక్రమాల’పై దృష్టి సారిస్తారు. ముందుగా నెల లేదా రెండు నెలలపాటు కూల్చివేతలు చేపడతారు. తర్వాతా వారంలో నాలుగు రోజులు ఈ డ్రైవ్‌ కొనసాగిస్తారు. ఆన్‌లైన్‌లో అందిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను ఎప్పటికప్పుడు నమోదు చేసేందుకు కొందరు ఉద్యోగులను ఒప్పంద ప్రాతిపదికపైన నియమించనున్నారు. గతంలోనూ అక్రమ లేఅవుట్లు.. అనధికార నిర్మాణాలపై చర్యలు తీసుకునేందుకు హెచ్‌ఎండీఏ ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టింది. చాలాచోట్ల భవనాలు, లేఅవుట్లలోని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసింది. రాజకీయ ఒత్తిడికీ వెనుకాడకుండా అధికారులు అడుగు ముందుకేశారు. ఏం జరిగిందో తెలియదు.. కొద్ది రోజుల్లోనే ప్రత్యేక డ్రైవ్‌కు మంగళం పాడారు. పోనీ.. పాక్షికంగా కూల్చేసిన  భవనాలు, లేఅవుట్లనూ పట్టించుకోలేదు. రెండు, మూడ్రోజుల తర్వాత యథావిధిగా యజమానులు పనులు మొదలుపెట్టారు. నిర్మాణాలను పూర్తి చేసి  ఫ్లాట్లను విక్రయించేశారు. భండారీ లేఅవుట్‌ ఇందుకు నిదర్శనం. కొందరు హెచ్‌ఎండీఏ అధికారులు ఈ ప్రత్యేక డ్రైవ్‌ పేరిట అక్రమార్కుల నుంచి భారీగా దండుకున్నట్లు ఆరోపణలు వినిపించాయి. ఈసారైనా ఇలా జరగకుండా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరముంది. ‘ఏపీవోలు అక్రమ లేఅవుట్లు, నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తారు. స్థానిక అధికారులు స్పందించకపోతే మేం రంగంలోకి దిగుతాం. ఇప్పటికే కొన్నింటిపై చర్యలు తీసుకున్నాం. మార్చిలో ప్రత్యేకంగా నిర్వహించే డ్రైవ్‌లో అలాంటి వాటిపై కొరడా ఝుళిపిస్తాం’ అని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు  పేర్కొన్నారు.
అమాయకులను ముంచేస్తున్నారు... 
అటు గ్రామ పంచాయతీలు పట్టించుకోవు.. ఇటు సిబ్బంది కొరతతో హెచ్‌ఎండీఏ క్షేత్రస్థాయిలో నిఘా పెట్టే పరిస్థితి లేదు. ఇదే అదునుగా వేల సంఖ్యలో అక్రమ లేఅవుట్లు.. లక్షల్లో అనధికార నిర్మాణాలు వెలిశాయి. ఇంకా వెలుస్తూనే ఉన్నాయి. కొందరు స్థిరాస్తి వ్యాపారులు గ్రామ పంచాయతీల అనుమతి ఉందంటూ అమాయకుల్ని నిలువునా ముంచేస్తున్నారు. తీరా.. అసలు విషయం తెలిసి నిలదీస్తే.. క్రమబద్ధీకరణకు అవకాశమిచ్చినప్పుడు దరఖాస్తు చేసుకోమని సమాధానం చెబుతున్నారు. ఫిర్యాదు వస్తేగానీ హెచ్‌ఎండీఏ మేల్కోనడం లేదు.  కొందరు అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కవుతున్నారు. నామ్‌కేవాస్తేగా నోటీసులు జారీ   చేస్తున్నారు. ఆ తర్వాత అందిన కాడికి దండుకొని అటువైపు కన్నెత్తి చూడటం లేదు. తామిచ్చిన ఫిర్యాదు ఏమైందని అడిగితే.. అదే పని మీద ఉన్నామంటూ సమాధానమిచ్చి తప్పించుకొంటున్నారు.

Related Posts