యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. వైఎస్ కుటుంబానికి అత్యంత ఆత్మీయులైన గౌరు కుటుంబం… తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకుంది. తమ ప్రత్యర్థి అయిన కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టిక్కెట్ ఖరారు చేయడం.. తమ రాజకీయ భవిష్యత్‌కు కనీస భరోసా ఇవ్వకపోవడంతో.. వారు అసంతృప్తికి గురయ్యారు. మూడు రోజుల పాటు వరుసగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. పాణ్యం నుంచి తెలుగుదేశం పార్టీ టిక్కెట్‌పై పోటీ చేస్తామని… ఈ నెల తొమ్మిదో తేదీన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతామని ప్రకటించారు. గౌరు వెంకటరెడ్డి అంటే.. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత ఆత్మీయుడు. కర్నూలు జిల్లా రాజకీయాల్లో గౌరు కుటుంబానికి.. వైఎస్ చాలా ప్రాధాన్యమిచ్చారు. వైఎస్ చనిపోయిన తరవాత వారి కుటుంబం జగన్ వెంట నడిచింది. గత ఎన్నికల్లో గౌరు చరితకు పాణ్యం టిక్కెట్ ఇచ్చారు జగన్. ఆ సమయంలో.. పాణ్యంలో బలమైన అభ్యర్థిగా ఉన్న కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇండిపెండెంట్‌గా పోటీ చేసినా.. ఆమె విజయం సాధించారు. అయితే.. ఆ తర్వాత గౌరు చరిత సోదరుడు..మాండ్ర శివానందరెడ్డి టీడీపీలోచేరారు. అప్పట్నుంచి జగన్ గౌరు కుటుంబాన్ని దూరం పెట్టడం ప్రారంభించారు. చివరికి టిక్కెట్ నిరాకరించడానికి కాటసాని రాంభూపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నారు.మాండ్ర శివానందరెడ్డి టీడీపీలో చేరిన తర్వాత కూడా.. గౌరు కుటుంబసభ్యులు జగన్‌కు విధేయులుగానే ఉన్నారు. కర్నూలు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకే మెజార్టీ ఉందని తెలిసినప్పటికీ… జగన్ ఆదేశం మేరకు పోటీ చేసి.. గౌరు వెంకటరెడ్డి ఓడిపోయారు. అయితే.. తన వర్గానికి ఉన్న పలుకుబడితో.. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్పా చక్రపాణిరెడ్డికి చమటలు పట్టించారు. చాలా స్వల్ప తేడాతోనే శిల్పా చక్రపాణిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత నంద్యాల ఉపఎన్నిక సమయంలో.. శిల్పా బ్రదర్స్ వైసీపీలో చేరి… ఎమ్మెల్సీకి రాజీనామా చేశారు. ఇలా.. తమకు ప్రత్యర్థులుగా ఉన్న వారందర్నీ వైసీపీలో చేర్చుకోవడం.. చివరకు తమకు టిక్కెట్ లేకుండా చేయడంతో..రాజకీయ భవిష్యత్ కోసం వారు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.