యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
సూపర్ స్టార్ రజనీకాంత్… లోక్ సభ ఎన్నికల వేళ రజనీకాంత్ ఎవరి వైపు మొగ్గు చూపుతారు? తటస్థంగా ఉంటారా? లేక ఏదో ఒక పార్టీకి స్నేహ హస్తం అందిస్తారా? అన్నది ఇప్పుడు తమిళనాట చర్చనీయాంశంగా మారింది. రజనీకాంత్ తమిళనాడులో కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకూ పార్టీని ప్రకటించలేదు. పార్టీలో సభ్యత్వాలను చేర్చడం, జిల్లా, క్షేత్రస్థాయిలో కొందరిని నియమించుకుని వారిచేత కోటిన్నరకు పైగా సభ్యులను చేర్చాలన్న లక్ష్యంతో రజనీకాంత్ ముందుకు వెళుతున్నారు. అయితే కొత్తగా పార్టీ పెట్టబోతున్న రజనీకాంత్ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదా? అన్న దానిపై ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలను ఆయనే తొలగించారు. తన పార్టీ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించి అందరినీ ఆశ్చర్యపర్చారు.రజనీ రాజకీయాల్లోకి వస్తారని అందరూ ఊహించారు. లోక్ సభ ఎన్నికలతో పాటు 21 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతుండటంతో రజనీ పార్టీ పెట్టి ప్రజల్లోకి వస్తారని ఆయన అభిమానులు ఆశగా ఎదురు చూశారు. కానీ మరోసారి అభిమానులను ఆయన నిరాశపర్చారు. రజనీ ఎన్నికలకు ఎందుకు వెనకడుగు వేశారన్నది ఇప్పుడు అభిమానుల నుంచి వస్తున్న ప్రశ్న. అయితే రజనీకాంత్ ఆలోచనలు వేరేగా ఉన్నాయంటున్నారు. ఆయన 2021లో జరిగే శాసనసభ ఎన్నికలే లక్ష్యంగా పార్టీని నిర్మించాలని భావిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురయితే అది వచ్చే శానసనభ ఎన్నికలపై ఉంటుందనే రజనీ ఈ ఎన్నికలకు దూరంగా ఉన్నారన్నది మరో విశ్లేషణ. రజనీకాంత్ రాజకీయాల్లోకి నేరుగా రాకపోయినా ఆ పార్టీ మాత్రం సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కోటి సభ్యత్వాన్ని చేర్పించారు. ప్రతి గ్రామంలో రజనీకి ప్రత్యేక ఓటు బ్యాంకు ఉంది. ఆయన అభిమానులతో పాటు తటస్థులు కూడా రజనీ కోసం ఎదురు చూస్తున్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రజనీ మద్దతు ఎవరికి ఉంటుందన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ అయంది. రజనీకాంత్ తొలి నుంచి భారతీయ జనతా పార్టీకి దగ్గరగా ఉన్నారన్న ప్రచారం జరిగింది. ప్రచారమే కాదు రజనీ అడుగులు కూడా కమలానికి దగ్గరని కొన్ని సంఘటనలు స్పష్టం చేశాయి. దీంతో ఇప్పుడు అధికార అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి ఆయన మద్దతు ప్రకటిస్తారని ఆ పార్టీలు బాహాటంగానే చెబుతున్నాయి.మరోవైపు విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా మక్కల్ నీది మయ్యమ్ పార్టీని స్థాపించి ప్రజల ముందుకు వెళుతున్నారు. ఆయన తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్ సభ స్థానాలు, 21 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి రెడీ అయ్యారు. మూడో కూటమిని ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. రజనీ తనకు స్నేహితుడని ఆయన మద్దతు తనకే ఉంటుందని, త్వరలోనే రజనీతో సమావేశమవుతానని కమల్ చెబుతున్నారు. ఇలా రజనీని తమ వాడిగా చెప్పుకునేందుకు అన్ని పార్టీలూ తమిళనాడులో పోటీ పడుతున్నాయి. కానీ రజనీ మాత్రం మద్దతుపై మౌనం పాటిస్తున్నారు.