యువ్ న్యూస్ పొలిటికల్ బ్యూరో:
ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. మరో రెండు మాసాల్లోనే ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఏ పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది? అనే చర్చ జోరుగా సాగుతోంది. అదేసమయంలో మెజారిటీ ప్రజల భావన ఎలా ఉందనే విషయం కూడా చర్చకు వస్తోంది. ఈ క్రమంలో విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో అధికార పీఠం కోసం మూడు పార్టీలు పోరుసాగిస్తున్నాయి. టీడీపీ, వైసీపీ, జనసేనలు వచ్చే ఎన్నికల్లో హోరా హోరీగా తలపడేందుకు రెడీ అవుతున్నాయి. ఈ క్రమంలోనే అధికారంలోకి వచ్చేందుకు మేమంటే మేమని పోటీ పడుతున్నాయి. దీంతో రాజకీయ వేడి మరింత పెరిగిందనే చెప్పాలి.ఈ క్రమంలోనే జనాల అభిప్రాయం ఎలా ఉందంటే.. రాష్ట్రంలోని జిల్లాల్లో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో జగన్ కావాలని అంటుంటే… మరికొన్ని చోట్ల మాత్రం చంద్రబాబుకు పెద్ద పీట వేస్తున్నారు. దీంతో ఒక విధ మైన గందరగోళం ఏర్పడిందనే చెప్పాలి. సీఎంగా చంద్రబాబు ప్రస్తుతం పెంచిన పింఛన్లపై కూడా మిశ్రమ స్పందన వ స్తోంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఊరుకున్న చంద్రబాబు ఇప్పుడు ఎందుకు పింఛన్లు పెంచారని ప్రశ్నించేవారు, ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉనప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలను ప్రజలకు పంచేయడం ఎందుకు? అనే వారు కూడా కనిపిస్తు న్నాయి. అదేసమయంలో తమ జీవితాల్లో వెలుగులు ప్రసాదిస్తున్న చంద్రబాబుకు జై కొట్టే వారు కూడా కొందరు కనిపిస్తున్నారు.ఇక, జగన్ విషయానికి వస్తే.. అసెంబ్లీకి వెళ్లలేదని, ప్రజల తరఫున ప్రభుత్వంపై పోరాడలేదనే నిశిత విమర్శ చేస్తున్న వా రి సంఖ్య గతంలో ఎంత ఉందో ఇప్పటికీ అంతే ఉంది. ఇదేసమయంలో తాను అసెంబ్లీకి వెళ్లకపోవడాన్ని సమర్ధించుకున్న జగన్ వాదనను ప్రజలు ఎవరూ పెద్ద గా పట్టించుకోకపొవడం గమనార్హం. పాదయాత్ర ఎఫెక్ట్ బాగానే ఉంది. చంద్రబాబుపై వ్యతిరేకత, జగన్ కు ఒకసారి ఛాన్స్ ఇద్దామనే వారి సంఖ్య ఏపీలో బాగానే కనపడుతుంది. ఇక, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేనాని గురించి ప్రజలు ఏమనుకున్నారనే విషయాన్ని పరిశీలిస్తే.. వాస్తవానికి ప్రశ్నిస్తానంటూ వచ్చిన పవన్ ప్రజల మదిలో కొత్త ఆశలు చిగురింప జేస్తారని అందరూ అనుకున్నారు. పాలనలోనూ రాష్ట్రంలోనూ ఏదో మార్పు ఖాయమని భావించారు. పవన్ కొన్నాళ్లు మౌనం.. తర్వాత మళ్లీ రావడం.. మరికొన్ని రోజులు హడావుడి చేయడంతోనే పవన్ సరిపెడుతున్న పరిస్థితి. పైగా గతంలో పవన్ అన్న చిరంజీవి రాజకీయ ప్రవేశం, పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వంటి పరిణామాలు ఇప్పుడు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. దీంతో ఇప్పుడున్న పరిస్థితిలో ఎవరికీ కూడా ప్రజలు ఫుల్లు మార్కులు వేసే పరిస్థితి కనిపించకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రానున్న రెండు మాసాల్లోనూ పరిస్థితి మారుతుందేమో చూడాలి.