Highlights
- ఆర్జిత సేవా టిక్కెట్ల ధర పెంపు
- రూ.కోటి విరాళం సమర్పించిన ఎం ఆర్ ఐ భక్తుడు
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం కొరత లేకుండా విక్రయించడంలో తితిదే సఫలమైంది. దళారులకు పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేయడంలో విజయవంతమైంది. దీనికితోడు విక్రయించేస్థాయి పెరగడంతో కొన్ని రోజులుగా కేటాయించినవి మిగిలిపోతున్నాయి. దీంతో ప్రస్తుతం భక్తులకు కోరినన్ని లడ్డూలు అందజేస్తున్నారు. మరోవైపు వచ్చే వేసవి సెలవుల్లో రద్దీ నేపథ్యంలో కొరత లేకుండా ప్రసాద విక్రయానికీ తితిదే సన్నాహాలు చేస్తోంది. భక్తులు ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదానికి డిమాండ్ ఉంది. ఇదివరకు శ్రీవారి దర్శనం సందర్భంగా టిక్కెట్లపై సూచించిన మేరకు పరిమితంగా లడ్డూ ప్రసాదం పొందే అవకాశం ఉండేది. యాత్రికులు మరిన్ని కోరుకునే పక్షంలో లభ్యమయ్యేవికావు. ఈ తరుణంలో దళారులను ఆశ్రయించి అధిక ధరలో కొనుగోలు చేయడం, దీని వెనుక అక్రమాలు జరగడం రివాజుగా మారింది. ఈ నేపథ్యంలో లడ్డూ ప్రసాదం కొరత లేకుండా విక్రయానికి తితిదే చర్యలు చేపట్టింది. ఇదే సమయంలో ప్రసాదం తయారీలో వస్తున్న నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి ధరను పెంచింది. నిత్యం 3.50 లక్షల లడ్డూలు తయారీకి చర్యలు తీసుకుంది. శ్రీవారి ఆలయం ఉత్తరం వైపున అదనపు లడ్డూ టోకెన్ల విక్రయం ప్రారంభించింది. నిత్యం 50 వేల లడ్డూలను కేటాయించి ఒక్కో భక్తుడికి 10 వంతున పరిమితితో విక్రయిస్తోంది. విక్రయాలు చేపట్టినప్పటికీ ఇటీవల వారపు రోజుల్లో 10 వేల నుంచి 15 వేల వరకు మిగిలిపోతున్నాయి. వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని నిత్యం 70 వేల లడ్డూలు అందుబాటులోకి తీసుకువచ్చే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల ధరలను పెంచాలని తితిదే యాజమాన్యం భావిస్తోంది. ఈ విషయమై కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకూలిస్తే మార్చి ఒకటి నుంచి ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టిక్కెట్ల ధరల విషయంలో హేతుబద్ధత లేదనే విమర్శలున్నాయి. మహాలఘు స్థానం నుంచి రెప్పపాటు దర్శనం కోసం (ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్టు పేరిట) రూ.300 భక్తులు చెల్లిస్తున్నారు. అదే కులశేఖరపడి వరకు అనుమతిస్తూ శ్రీవారిని కనులారా దర్శించుకోవడానికి (వీఐపీ బ్రేక్ దర్శనం పేరిట) టిక్కెట్టు ధర రూ.500గా ఉంది. 30 నిమిషాల పాటు పాల్గొనే సుప్రభాతం సేవ రూ.120, స్వామివారి మూలవిరాట్టు ఎదుట అరగంట వ్యవధి కూర్చుని తిలకించే భాగ్యం ఉన్న తోమాల, అర్చన టిక్కెట్ల ధరలు రూ.220 మాత్రమే ఉన్నాయి.
శ్రీశైలం, విజయవాడ ఆలయాలతో పోల్చుకుంటే అభిషేకం టిక్కెట్టు ధర చాలా తక్కువగా ఉంది. ఎన్నో ఏళ్లనాటి ధరలు అమల్లో ఉన్నందున పెంచాలనే ప్రతిపాదన గతంలో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన ఉన్న ధర్మకర్తల మండలి అభిప్రాయపడింది. ఇందుకోసం మండలి తరఫున ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి హేతుబద్ధంగా లేని టిక్కెట్లను పరిశీలించి ధరలు ఖరారు చేయడానికి సిఫార్స్‌లు కోరింది. ఈ మేరకు ఉప సంఘం నివేదిక కూడా ఇచ్చింది. పదవీకాలం పూర్తి అవుతున్న తరుణంలో ధరల పెంపు విషయం మండలి పక్కనపెట్టింది. నివేదికను పరిశీలించి ధరలపై సమీక్షించాలని భావించిన దేవస్థానం ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల పెంపుపై ఓ నిర్ణయానికి వచ్చారు. ఎల్-1 కేటగిరి టిక్కెట్టు ధర రూ.2 వేలు, ఎల్-2 రూ.1,000, ఎల్-3 రూ.500 వంతున ఖరారు చేయాలని సంకల్పించింది. ఆర్జిత సేవలతోపాటు వీఐపీ బ్రేక్ దర్శనం టిక్కెట్ల ధరలను పెంచాలని భావిస్తోంది. ఈ విషయమై త్వరలోనే ప్రకటన చేయడానికి దేవస్థానం ఉన్నతాధికారులు సిద్ధంగా ఉన్నారు.
లడ్డూలు తయారీకి చర్యలు తీసుకుంది. శ్రీవారి ఆలయం ఉత్తరం వైపున అదనపు లడ్డూ టోకెన్ల విక్రయం ప్రారంభించింది. నిత్యం 50 వేల లడ్డూలను కేటాయించి ఒక్కో భక్తుడికి 10 వంతున పరిమితితో విక్రయిస్తోంది. విక్రయాలు చేపట్టినప్పటికీ ఇటీవల వారపు రోజుల్లో 10 వేల నుంచి 15 వేల వరకు మిగిలిపోతున్నాయి. వేసవి సెలవుల్లో రద్దీని దృష్టిలో ఉంచుకొని నిత్యం 70 వేల లడ్డూలు అందుబాటులోకి తీసుకువచ్చే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చర్యలు తీసుకున్నట్లు తిరుమల జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు.
శ్రీవారికి ప్రవాస భారతీయుడు రూ. కోటి విరాళం
శ్రీవారికి మలేసియాకు చెందిన ప్రవాస భారతీయుడు కె.వి.ఎన్.సుగుమారన్ రూ.కోటి విరాళం సమర్పించారు. తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి (జేఈవో) శ్రీనివాసరాజును కలిసి చెక్కులను అందజేశారు. శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్టు కింద ఈ మొత్తాన్ని డిపాజిట్ చేయాలని కోరారు. దాతకు అధికారులు శ్రీవారి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందించి సత్కరించారు.